e-cigarette review Ping Yahoo GOSSIPS: January 2011

Wednesday, January 12, 2011

"గలగలా మాట్లాడడమే నాకు తెలుసు" -జెనీలియా

ఇప్పటికీ జెనీలియాని అంతా 'బొమ్మరిల్లు' హాసిని అనే పిలుస్తారు. ఆ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకున్న జెన్నీ మనసులో మాటలని ఆమె మాటల్లోనే చదవండి...
       హాయ్... ఏమిటీ.. జెనీలియా ప్రతి సినిమాలోనూ అల్లరి పిల్లలా కనపడుతుందీ, అనుకుంటున్నారు కదూ.. మీరే కాదులెండి... చాలా మంది నన్ను ఇదే విషయం అడుగుతూ వుంటారు. నిజమే...నేను మామూలుగా కూడా అల్లరిపిల్లనే! ఇంకా చెప్పాలంటే నేను టాం బాయ్ ని! ఎవరో ఏదో అనుకుంటారని నా ఎంజాయ్ మెంట్ ని పాడుచేసుకోలేను. చిన్నప్పుడైతే ఇక చెప్పేక్కర్లేదు. అల్లరంతా మనదే! ఫ్రెండ్స్ తో కలిసి అన్ని విషయాల్లోనూ చాలా హడావిడి చేసేదాన్ని. అల్లరికి తోడు మనం స్పోర్ట్స్ లో చాలా యాక్టివ్. పర్టిక్యులర్ గా ఒక ఆట అంటూ లేదు. ఏ ఆటలోనైనా సరే నేనే ముందుండే దాన్ని. బేస్కేట్ బాల్, క్రికెట్, హాకీ... అన్ని ఆటలూ ఆడాను. మీకో విషయం తెలియదు. నేను స్పోర్ట్స్ లో స్టేట్ లెవెల్ దాకా వెళ్లాను.కాలేజ్ రోజుల్లో ముంబై  ఆర్ధర్ రోడ్ లోని కాఫీ బార్లలోనే ఎక్కువగా గడిపేదాన్ని. ఫ్రెండ్స్ తో కలిసి అక్కడ కాఫీ తాగుతుంటే అసలు సమయమే తెలిసేది కాదు. ఇప్పటికీ అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. సాదా సీదా అమ్మాయిలా ఆ బార్లో కూర్చుని, కబుర్లు చెప్పుకుంటూ కాఫీ సిప్ చేయాలనిపిస్తుంది. అప్పుడప్పుడు వెళుతుంటా కూడా. అయితే, బిజీ వల్ల ఈమధ్య అసలు కుదరడం లేదు. అయ్ మిస్ ఎ లాట్! 

      మీకో విషయం తెలసా? అసలు నేను సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు.  మోడలింగులో కూడా పెద్దగా అనుభవం లేదు. అలాంటిది అనుకోకుండా రామోజీరావు గారు నిర్మించిన 'తుజే మేరీ కసం' సినిమాకి సెలెక్ట్ అయ్యాను. అయితే, మా పేరెంట్స్ వెంటనే ఒప్పుకోలేదు. ఎందుకంటే, సినిమా వాతావరణం గురించి అప్పటికే వాళ్లకి వేరే అభిప్రాయం వుంది. దాంతో కాస్త టైం పట్టింది వాళ్లు ఓకే చెప్పడానికి. నేను కూడా ముందు భయపడ్డాను. తర్వాత అలా అలా అంతా అలవాటైపోయింది. తర్వాత కెరీర్ లో ఎన్నో అప్ అండ్ దౌన్స్ చూసాను. మెల్లిగా పీక్ పాయింట్ కి చేరాను. అయితే, ఎప్పుడూ నేను భయపడలేదు. ఏ పరిస్థితిలోనూ కూడా పారిపోదామనిపించలేదు. ఇక్కడే వుండి సాధించాలనుకున్నాను. ఎన్నో మాటలు పడ్డాను. నేనుంటే సినిమాలు ఫ్లాప్ అన్నారు. అన్నిటినీ మౌనంగా భరించాను. ఒక్కసారి హిట్ వచ్చాక మళ్లీ అంతా నన్ను పొగడడం మొదలెట్టారు. నేను అటు అపజయాలనీ, ఇటు జయాలనీ రెండింటినీ సమానంగానే స్వీకరించాను. దేనికీ కుంగిపోలేదు, దేనికీ మిడిసిపడలేదు. అంతా మన అదృష్టాన్ని బట్టే వుంటుంది. అంతే!     
      ఇప్పుడు బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నాను. ఇక్కడ కూడా నాకు మంచి పేరే వచ్చింది. సౌత్ లో చేస్తూనే హిందీలో కూడా చేస్తాను. దేనినీ వదులుకోను. సౌత్ లో లానే బాలీవుడ్ లో కూడా నాకు మంచి గౌరవం ఇస్తున్నారు. ఇక సెట్ లో నేను ఎక్కడున్నా ఒకటే. సరదాగా వుంటాను. నా చుట్టూ వున్న వాళ్లు కూడా అలాగే వుండాలని కోరుకుంటాను. గలగలా మాట్లాడడమే నాకు తెలుసు. మూతి బిడాయించుకుని రిజర్వేడ్ గా వుండడం ఈ జెన్నీకి తెలియదు. తానెప్పుడూ ఇలాగే జోష్ తో వుంటుంది!

చిరంజీవి కోసం వర్మ పాట్లు


 
 
 
 
       రాంగోపాల్ వర్మ పట్టువదలని విక్రమార్కుడిగా చిరంజీవి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తనతో చిరంజీవి ఇక సినిమా చేయడని తెలిసి కూడా రకరకాల పద్ధతుల్లో తన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ట్విట్టెర్ ని కూడా ఉపయోగించుకుంటున్నాడు. అస్తమానూ చిరంజీవి ప్రస్తావన ఏదో ఒక రూపంలో తెస్తున్నాడు. తాజాగా కూడా తెచ్చాడు. "చిరంజీవి గారి 150 వ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఇది ఇంకా ఎందుకు స్టార్ట్ అవలేదో ఎవరైనా చెప్పగలరా?" అంటూ అడుగుతున్నాడు. "చిరంజీవి గారు నాతో చేయరని తెలుసు. దానికి మా ఇద్దరి మధ్య చాలా కారణాలున్నాయి. అయితే, నేను చేయాలనుకుంటున్న 'దొర' ద లార్డ్ సినిమాని ఆయనతోనే చేయాలని మాత్రం కోరుకుంటున్నాను" అంటూ సోప్ వేస్తున్నాడు. మరి, చిరంజీవి పొరబాటున వర్మ బుట్టలో పడతాడేమో చూడాలి!

'నేను-నా రాక్షసి' వాయిదా ఎందుకు?

రానా, ఇలియానా జంటగా పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న 'నేను-నా రాక్షసి' చిత్రం ఇప్పట్లో విడుదలయ్యేలా కనపడటం లేదు. మొదట్లో సంక్రాంతి రిలీజ్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రం సంక్రాంతి రేస్ నుంచి సైలెంట్ గా తప్పుకుంది. సమ్మె వల్ల మిగిలి వున్న షూటింగ్ ఆగిపోయిందనీ, ఇక జనవరి నెలాఖరుకే విడుదల అనీ నిన్నటి దాకా వార్తలొచ్చాయి. అయితే, ఇప్పుడు ఈ డేట్ కూడా మారిందనీ, రిలీజ్ మార్చికి వాయిదా పడిందనీ వార్తలొస్తున్నాయి. దీనికి కారణం నిర్మాణానికి సంబంధించినదేనా? లేక అమితాబ్ సినిమా మోజులోపడిపోయిన పూరీ దీనిని వెనక్కి నెట్టేస్తున్నాడా? అన్నది తెలియాల్సి వుంది. 

బాలీవుడ్ లో జాగా వెతుక్కున్న 'పులి' హీరోయిన్

 
 
       ఒక్కో సినిమా కొంత మందిని పైకి లేపితే, ఒక్కో సినిమా కొందరిని అడ్రస్ లేకుండా చేసేస్తుంది. పాపం.. కధానాయిక నికీషా పటేల్ వ్యవహారం కూడా అలాగే అయిపోయింది. పవన్ కల్యాణ్ నటించిన 'పులి' సినిమా ద్వారా ఈ అమ్మాయి పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆశలన్నీ ఆ సినిమా ఫ్లాప్ తో ఆవిరైపోయాయి. 'పులి' విడుదలకు ముందు 'మా సినిమాలో నువ్వే హీరోయిన్ వి' అంటూ ప్రామిస్ చేసిన వాళ్లంతా, సినిమా కాస్తా ఫ్లాప్ అవడంతో మెల్లిగా జారుకున్నారు. దాంతో తన ఫొటో ఆల్బమ్ పట్టుకుని అటు, ఇటు తిరగడం మొదలుపెట్టింది. తాజాగా తెలిసిన సమాచారమేమిటంటే, బాలీవుడ్ లో ప్రముఖ ఫిలిం మేకర్ అయిన సుభాష్ ఘై ఈమెకు తన తదుపరి చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడట. దీంతో 'హమయ్య' అంటూ నికీషా ఊపిరి పీల్చుకుంటోంది. తన కెరీర్ తో ఆడుకున్న టాలీవుడ్ వైపు 'ఇక చచ్చినా చూడను' అని ఒట్టు కూడా పెట్టుకుందంటున్నారు.

'క్రికెట్ గర్ల్స్ & బీర్' పాటలు

తెలుగులో ఇప్పుడు రకరకాల టైటిల్స్ తో సినిమాలు వచ్చేస్తున్నాయి. అటువంటి సినిమాల్లో ఒకటి 'క్రికెట్ గర్ల్స్ & బీర్'. టైటిల్ చూస్తే ఇదేదో కాస్త మోతాదు ఎక్కువే అన్నట్టుగా వుంది కదూ! ఈ సినిమా ఆడియో వేడుక సోమవారం రాత్రి హైదరాబాదులోని ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి రఘువీరారెడ్డి పాటల సీడీని విడుదల చేయగా, తొలి సీడీని నిర్మాత సి.కల్యాణ్ అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, "ఇందులో హీరోగా నటించిన ఆదర్శ్ మా అన్న కొడుకు. ఇన్నాళ్లూ వాడు అన్నీ విలన్ పాత్రలే చేసాడు. అందుకే వాడిని 'విలన్' అంటూ సరదాగా పిలుస్తాను. ఈ సినిమా ద్వారా హీరో అనిపించుకున్నాడు. ఇది మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా వరుణ్ సందేశ్, ఆదర్శ్, సూర్యతేజ్, నాగశౌర్య, సారిక, దైవజ్నశర్మ, దర్శకుడు ఉమేష్ కుమార్, నిర్మాత సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

"అవన్నీ డాడీ దగ్గర నేర్చుకున్నాను" -శృతి హాసన్

 
 
  కమల హాసన్ తనయ శృతి హాసన్ ఇప్పుడు రోజులు లెక్కపెడుతూ కూర్చుంది. జనవరి 14 ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తోంది. ఎందుకంటే, ఆమె కధానాయికగా నటించిన 'అనగనగా ఓ ధీరుడు' సినిమా ఆరోజు విడుదలవుతోంది. టాలీవుడ్ లో తన కెరీర్ ను అటో ఇటో తేల్చేది ఆ సినిమానే! తన తల్లిదండ్రుల నుంచి అందం... అభినయం వారసత్వంగా పొందిన శృతి మంచి గాయని కూడా. ఈ చిత్రం విడుదలవుతున్న నేపధ్యంలో ఆమెతో జరిపిన ఇంటర్వ్యు విశేషాలు....
"మీ డాడీ బ్రాండ్ మీకెంతవరకు ఉపయోగ పడుతుందనుకుంటున్నారు ?"
"కమల్ డాటర్ గా నన్ను అందరూ గౌరవిస్తారు. అది అంత వరకే! ఎందుకంటే, డాడీతో ఎవరినీ కంపేర్ చేయలేం. అలాగే డాడీని ఎవరితోనూ కంపేర్ చేయలేం. ఆయన ప్రత్యేకత అది. అటువంటప్పుడు నాకు కూడా ఇది వర్తిస్తుంది. అయినా నాకూ అది ఇష్టం లేదు. స్వయం ప్రకాశం కావాలన్నది నా కోరిక"
"సినిమాల ఎంపికలో డాడీ హెల్ప్ చేస్తారా?"
"డాడీ అస్సలు ఇన్వాల్వ్ కారు. అటువంటివి ఆయనకు ఇష్టం వుండదు. ఎవరి డెసిషన్ వాళ్లు తీసుకోవాలని అంటారాయన. ఎవరి కెరీర్ ను వాళ్లే నిర్మించుకోవాలని చెబుతారు. సో.. ఈ విషయంలో ఆయన ప్రమేయం వుండదు"
"సరే, ఈ 'అనగనగా..' సినిమా ప్రాజక్టు వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు?"
"ఈ ప్రాజక్టు నా వద్దకు వచ్చినప్పుడు ముందు ఆశ్చర్య పోయాను. వండర్ ఫుల్ ప్రాజక్ట్ అనిపించింది. తర్వాత ఇందులో హీరో సిద్ధార్థ్ అనగానే కాస్త భయపడ్డాను. అలాంటి ఆర్టిస్టుతో చేయగలనా? అనిపించింది. అయితే, చాలెంజేస్ ను ఎలా ఫేస్ చేయాలో డాడీ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి, ధైర్యంగా ముందుకు నడిచాను"
"ఇందులో మీ క్యారెక్టర్ ఎలా సాగుతుంది?"
"ఒక క్వీన్ లాంటి యువతి పాత్ర. ఆ క్యారక్టర్ పేరు ప్రియ. దాంతో మేకప్, డ్రెస్సింగ్ విషయంలో ఎంతో కేర్ తీసుకోవాల్సి వచ్చింది. డిల్లీ నుంచి వచ్చిన మేకప్ ఎక్స్ పర్ట్ చక్కని మేకప్ చేసారు. మేకప్ అయ్యాక నన్ను నేనే నమ్మలేకపోయాను. అద్దంలో చూసుకుంటే నాకు నేనే ముద్దొచ్చాను"
"ఈ సినిమా హైలైట్స్ ఏమిటి?"
"ముందు కధే పెద్ద హైలైట్. సోషియో ఫేంటసీ కదా? చూడడానికి థ్రిల్ గా వుంటుంది. డైరెక్టర్ ప్రకాష్ ప్రతి పాత్రనీ అద్భుతంగా మలిచాడు. మనల్ని మరో లోకంలో విహరింపజేస్తాడు. లక్ష్మీ ప్రసన్న పోషించిన ఐరెంద్రి పాత్ర కూడా చాలా బాగుంటుంది. తను బాగా చేసింది కూడా"
"టాలీవుడ్ లో అనుభవం ఎలా వుంది?"
"చాలా బాగుంది. ఇక్కడంతా వర్క్ మైండెడ్ పీపుల్. ఎవరిపని వాళ్లు కష్టపడి చేస్తారు. టాలీవుడ్ గురించి డాడీ ఎప్పుడూ చెబుతుండేవారు, మంచి ఇండస్ట్రీ అని. అది ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాను"
"గతంలో 'ఈనాడు' సినిమాకి సంగీతం సమకూర్చారు కదా, మళ్లీ ఎప్పుడు చేయాలనుకుంటున్నారు?"
"సంగీతం అనేది ఎక్కువ టైం తో కూడుకున్న వ్యవహారం. ఒక సినిమాకు వర్క్ చేయాలంటే కనీసం నాలుగు నెలలైనా పడుతుంది. ఇక వేరే పనులు ఏవీ పెట్టుకోకూడదు. 'ఈనాడు' టైం లో కూడా అలాగే కొన్ని అవకాశాలు వదులుకున్నాను. ఇప్పట్లో మళ్లీ లేదనే చెప్పాలి"
"సరే, ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ... ఆల్ ది బెస్ట్"
"థాంక్యు"   

రామ్ చరణ్ 'మెరుపు' కధ ఫైనలైజ్ అయింది

 
 
          'మగధీర' సినిమాతో మాంచి కమర్షియల్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, అందుకు భిన్నంగా 'ఆరెంజ్' సినిమాలో సోబెర్ క్యారెక్టర్ చేయడంతో జనానికి అది ఎక్కలేదు. 'ఇటువంటి సినిమాలు వద్దు బాబూ... నువ్వు పక్కా మాస్ సినిమాలే చెయ్" అంటూ ప్రేక్షకులు ఆ సినిమాని ఫ్లాప్ చేసి, వార్నింగ్ ఇచ్చారు. ఆ అనుభవంతో అంతకు ముందే స్టార్ట్ చేసిన 'మెరుపు' సినిమా షూటింగును కూడా ఆపేశారు. చరణ్ ఇమేజ్ కి అనుగుణంగా కధకు రిపేర్ చేయడం మొదలెట్టారు. తాజాగా ఈ సినిమా కధ ఓకే అయిందని రామ్ చరణ్ చెబుతున్నాడు. "మెరుపు కధ ఇప్పుడు ఫైనలైజ్ అయింది. సూపర్ గా వచ్చింది. ఫుల్ ఎంటర్ టైనర్ గా, కమర్షియల్ మూవీగా ఉండేలా కధను రూపొందించడం జరిగింది" అంటున్నాడు చరణ్. ఈ సినిమా షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కూడా అంటున్నాడు. రెండు, మూడు రోజుల్లో ఇండస్ట్రీ  స్ట్రయిక్  పూర్తవుతుందనీ, 'మెరుపు' షూటింగులో పాల్గొంటాననీ చెబుతున్నాడు. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది

టాలీవుడ్ లోకి చొచ్చుకుపోయిన భాను కిరణ్

టాలీవుడ్ ని ఈమధ్య కాలంలో మాఫియా, ఫ్యాక్షన్ సంబంధాలు పట్టిపీడిస్తున్నాయి. ఫైనాన్స్ కోసం కొంతమంది నిర్మాతలు ఇటువంటి వర్గాలతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం వల్ల ఆ సంబంధాలు బలపడుతున్నాయి. పైగా, ఇటువంటి వాళ్లు తమకు అండగా వున్నారని చెప్పుకోవడాన్ని ఈవేళ చాలా మంది గర్వంగా ఫీలవడం టాలీవుడ్ చేసుకున్న దౌర్భాగ్యం. సినిమా వాళ్లు అందించే  'సౌఖ్యాల'కు అలవాటు పడ్డ ఆ నేరమయ వర్గాలు టాలీవుడ్ ని కమాండ్ చేసే స్థితికి ఎదిగిపోయాయి. ఇప్పుడు మద్దెలచెరువు సూరి హత్యోదంతం ఈ లింకులను మరోసారి బహిర్గతం చేస్తోంది. సూరి హత్యలో కీలక పాత్రధారిగా భావిస్తున్న భాను కిరణ్ గత కొంత కాలంగా సినిమా వాళ్లతో నెరపుతున్న 'బంధుత్వాలను' చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సి.కల్యాణ్, శింగనమల రమేష్ వంటి ప్రముఖ నిర్మాతలు భానుతో కొనసాగిస్తున్న సంబంధాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయిప్పుడు. సూరి పేరు చెప్పి భాను సినిమా పంచాయతీలు కూడా నిర్వహించాడంటే ఈ నేరమయ వ్యవస్థ టాలీవుడ్ లోకి ఎంతెలా చొచ్చుకుపోయిందో మనం ఊహించచ్చు.
         భాను కొంతమంది హీరోయిన్లతో 'సంబంధాలు' కూడా పెట్టుకుని, ఆయా హీరోయిన్లను కొన్ని సినిమాలకు రికమండ్ చేసేవాడంటే టాలీవుడ్ లో అతనెంతెలా  ఎదిగిపోయాడో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు నిర్మాత కల్యాణ్ పేరు బయటకు రావడంతో అతను అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడని తెలుస్తోంది. ఈ వర్గాలతో లింకులు వున్న వాళ్లు ఇంకెంత మంది బయటకు వస్తారో త్వరలోనే తెలుస్తుంది. ఒకప్పుడు తెలుగు చిత్ర సీమకు ఎంతో పేరుండేది. ఇప్పుడా పేరు ఇటువంటి వాళ్లతో కలుషితమైపోతోంది. బాలీవుడ్ లాగే టాలీవుడ్ కూడా నేరగాళ్లకు నిలయంగా మారిపోతోంది. దీనికి  ఇప్పటికైనా అడ్డుకట్ట వేసుకోకపోతే, టాలీవుడ్ కి ఉన్న పేరు కాస్తా ఎగిరిపోతుంది! 

'అలాంటి పోజులివ్వ'నంటున్న తారామణి

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ని రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ కధానాయిక అశిన్ మీద ఈమధ్య రూమర్లు వచ్చిన సంగతి మనకు తెల్సు. ఈ వార్త సద్దుమణగక ముందే మరో వార్త ఈ మల్లూ బేబీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదేమిటంటే, 'టూ పీస్' బికిని ధరించి ఈ అమ్మడు కెమెరాలకు పోజులిచ్చిందంటూ వచ్చిన వార్తలు ఆమెను బాగా అప్ సెట్ చేసాయి. దానికి తోడు అటువంటి ఫొటోలు కూడా ఇంటర్ నెట్ లో బాగా షికార్లు చేస్తుండడంతో అవి ఆమె కంట కూడా పడ్డాయి. అయితే, ఆ ఫొటోలు తనవి కావనీ, మార్ఫింగ్ మాయాజాలంతో కొంతమంది ఆకతాయీలు చేసిన ఫొటోలనీ అశిన్ వివరణ ఇస్తోంది. "ఆ ఫొటోలు చూసాను. అసలు నా ఫిజిక్ కీ, ఆ ఫొటోలలోని ఫిజిక్ కీ సంబంధమే లేదు. ఎవరో తుంటరోళ్లు చేసిన మార్ఫింగ్ ఫొటోలివి. నేనెప్పుడూ ఇలా బికినీలు వేసుకోను. సినిమాలు లేకపోతే ఇంట్లోనైనా కూర్చుంటాను తప్ప ఇలాంటి పోజులివ్వను" అంటూ కాస్త ఎమోషనల్ గా చెప్పింది అశిన్. కావాలంటే ఆ ఫొటోలను మీరూ నెట్ లో చూడొచ్చు!

'దేవదాసు' రామ్ కి 'హ్యాపీ హీరో డే'

యంగ్ హీరో రామ్ వయసిప్పుడు ఐదేళ్లట. కంగారుపడకండి... అసలు వయసు కాదు... ఆర్టిస్టుగా! అవును, తను సినిమాల్లోకి వచ్చి సరిగ్గా నేటికి ఐదేళ్ళయిందట. ఈ విషయం తనే చెబుతున్నాడు. "నా తొలి చిత్రం 'దేవదాసు' 2006 జనవరి 11 న రిలీజ్ అయింది. అంటే, సరిగ్గా ఈరోజుకి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. సో.. ఆర్టిస్టుగా ఇప్పడు నాకు ఫైవ్ ఇయర్స్ అన్నమాట, నాకు నేనే 'హ్యాపీ హీరో డే' చెప్పేసుకుంటున్నాను" అంటున్నాడు హ్యాపీగా. అభిమానుల్ని అలరించడం కోసం ముందుముందు ఇంకా మంచి సినిమాలు చేస్తానంటున్నాడు. ఈ ఐదేళ్లలో రామ్ మొత్తం ఆరు సినిమాలు (దేవదాసు, జగడం, రెడీ, మస్కా, గణేష్, రామ రామ కృష్ణ కృష్ణ) చేయగా, వీటిలో 'దేవదాసు', 'రెడీ' ఈ రెండే హిట్ అయ్యాయి. కాగా, టాలీవుడ్ లో ప్రస్తుతం జరుగుతున్న సమ్మె త్వరలోనే ముగుస్తుందనీ, బహుశా 17 నుంచి తను 'కందిరీగ' షూటింగులో పాల్గొంటాననీ చెబుతున్నాడు. ఈ 'కందిరీగ' సినిమానే టాలీవుడ్ లో ఈ కల్లోలానికి కారణమన్న సంగతి అందరికీ తెలిసిందే!  

సంక్రాంతి 'వీరుడు' ఎవ్వరు?

సంక్రాంతికి సినిమాలు రిలీజ్ కావడం మన సంస్కృతిలో ఓ భాగమైపోయిందనే చెప్పాలి. ప్రతి ఏడూ పెద్ద హీరోల చిత్రాలు పెద్ద పండగగా పిలుచుకునే సంక్రాంతికి బోలెడు హంగులతో వస్తుంటాయి. ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు వస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోతగ్గది 'పరమ వీర చక్ర'. బాలకృష్ణ హీరోగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వస్తున్న చిత్రం కాబట్టి దీనిపై ఎన్నో అంచనాలున్నాయి. దాసరికి 150 వ చిత్రం కావడం ఒకెత్తయితే, 'సింహా' వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న బాలకృష్ణ చిత్రం కావడం మరో ఎత్తు. నిజంగా మునుపటి దాసరి లా ఆయన తీసుంటే కనుక, ఇక ఈ సినిమాకు తిరుగు లేదు!  అలాగే, రవితేజ నటించిన 'మిరపకాయ్' కూడా ఈ రేస్ లో వుంది కానీ, ఎక్స్ పెక్టేషన్స్ మాత్రం అంతగా లేవు. ఇక అంచనాలు బాగా వున్న మరో సినిమా 'అనగనగా ఓ ధీరుడు'. కేస్టింగ్ పరంగా, టెక్నీషియన్ ల పరంగా క్రేజ్ లేకపోయినా ఫేంటసీ సినిమా కావడం అందర్నీ ఆకర్షిస్తోంది. ఇక సుమంత్ నటించిన 'గోల్కొండ హై స్కూల్' కి పోటీ ఇచ్చే స్థాయి లేదు. ఏమైనా, ఒక రోజు అటు, ఇటు తేడాతో రిలీజ్ అవుతున్న వీటిలో చివరికి ఏవి పేలతాయో, ఏవి తుస్ మంటాయో చూడాలి! 
 


"ఈ సినిమా కూడా వాటి సరసన చేరుతుంది" -బాలకృష్ణ

బాలకృష్ణ అభిమానులకు ఈరోజు పండగ రోజు. ఎందుకంటే, వాళ్లు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న 'పరమ వీర చక్ర' చిత్రం విడుదల నేడే! 'సింహా' వంటి సూపర్ హిట్ తర్వాత బాలకృష్ణ చేస్తున్న ఈ చిత్రం ఆయన కెరీర్ లో నిలిచిపోయేలా రూపొందిందని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ఆ చిత్రం గురించి బాలకృష్ణ చెప్పిన విశేషాలు ఆయన ఇంటర్వ్యులో చదవండి.
"ఈ సినిమా గతంలో మీ నాన్నగారు చేసిన 'బొబ్బిలి పులి' కి రీమేక్ అంటున్నారు, ఎంత వరకు నిజం?"
"అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. అసలా సినిమాకీ, దీనికీ ఏమాత్రం సంబంధం లేదు. దానికీ, దీనికీ దాసరి నారాయణ రావు గారు దర్శకత్వం వహించడం వల్ల, రెండింటికీ మిలటరీ బ్యాక్ డ్రాప్ వుండడం వల్ల చాలా మంది అలా అనుకుంటున్నారు. కానీ, రెండింటికీ ఎక్కడా పోలికలు వుండవు"
"ఇటీవల వచ్చిన 'సింహా'లోనూ, ఇందులోనూ కూడా మీరు డబుల్ రోల్ చేసారు కదా, ఎందుకని ఇలా జరిగింది?"
"ఇది కావాలని ఏదో ప్రణాళికతో చేసింది కాదు. మనం ఎంచుకునే కధను బట్టే ఏదైనా వుంటుంది. ఈ కధకున్న స్పాన్ అటువంటిది. ఆర్మీ ఆఫీసర్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా వుంటుంది. పూర్తి ఎమోషనల్ గా సాగుతుంది. ఇక రెండోది సినిమా హీరో పాత్ర. అంటే, నా నిజజీవిత పాత్రన్నమాట. మా నాన్నగారు అంటుండేవారు, 'కళ కళ కోసం కాదు...కళ అనేది సమాజం కోసం' అంటూ. ఈ పాత్ర నాన్నగారి మాటలకు ప్రతిరూపంగా నిలుస్తుంది"
"ఇందులో రావణ బ్రహ్మ వంటి పురాణ పాత్ర, కొమరం భీమ్ వంటి వీరుని పాత్ర పోషించారు కదా, మీ అనుభూతి?"
"ఓహ్...చెప్పలేని అనుభూతి. మాటల్లో వర్ణించలేనిది. నాన్నగారు అప్పట్లో 'సీతారామ కల్యాణం' సినిమాలో రావణాసురిడిగా నటించారు. అది నాకెంతో ఇష్టమైన పాత్ర. అందులో నాన్నగారు ప్రదర్శించిన శైలికి, నా స్టయిల్ ని జోడించి చేసానిందులో. ఇక కొమరం భీమ్ పాత్ర! ఆదిలాబాదు జిల్లాలో గిరిజనులైన గోండుల హక్కుల కోసం మడమ తిప్పకుండా పోరాడిన యోధుడు. అటువంటి వీరుని పాత్ర పోషించగలగడం నా అదృష్టం"
"భవిష్యత్తులో రావణుడి పాత్రతో పూర్తి నిడివి పౌరాణికం చేసే ఉద్దేశం ఉందా?"
"పరమ వీర చక్ర చేస్తున్నప్పుడే ఆ ఆలోచన వచ్చింది. 'సీతారామ కల్యాణం' చిత్రాన్ని నాన్నగారు వారి తల్లిదండ్రులకు అంకితం చేసారు. ఇప్పుడు ఇలాంటిది నేను కూడా చేసి వారికి అంకితం చేయాలని వుంది. చూద్దాం. భవిషత్తు ఎలా వుంటుందో!"
"దాసరి నారాయణ రావుగారితో చేయడం ఎలాంటి ఫీలింగ్ నిచ్చింది?"
"వారితో చేయడం అద్భుతమైన అనుభవం. అసలు వారు తీసిన 'శివరంజని' సినిమాలో నేనే చేయాలి. అయితే, అప్పట్లో ఇంకా చదువు కంప్లీట్ కాకపోవడంతో నాన్నగారు అనుమతివ్వలేదు. ఇన్నాళ్లకు వారితో చేసే అవకాశం కలిగింది. అది అదృష్టమనే చెప్పాలి. అంత పెద్ద దర్శకులై వుండి కూడా నేను ఏవో చిన్న చిన్న సూచనలు చేస్తే, సహృదయంతో స్వీకరించారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్! వారితో ఆ సినిమా అనుభవం మరచిపోలేనిది"
"మీ చిత్రాలకు సంక్రాంతి సెంటిమెంట్ వుంది కదా, ఈ చిత్రం సక్సెస్ విషయంలో మీకెలాంటి అంచనాలు వున్నాయి"
"అవును, గతంలో సంక్రాంతికి విడుదలైన మా చిత్రాలు 'పెద్దన్నయ్య', 'సమర సింహా రెడ్డి', 'నరసింహ నాయుడు', 'లక్ష్మీ నరసింహా', 'సింహా' వంటివి పెద్ద విజయాన్ని సాధించాయి. ఈ సినిమా కూడా వాటి సరసన చేరుతుంది"
"వంద సినిమాల మైలురాయికి చేరువవుతున్నట్టున్నారు?"
"అవును, ఇప్పుడిది 94 వ చిత్రం. త్వరగానే 100 కి చేరుకుంటాను. నూరవ సినిమా కచ్చితంగా ప్రత్యేకంగా వుంటుంది"

బాలచందర్ కి అక్కినేని అవార్డు ప్రదానం

ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు పేరిట ఏర్పాటు చేసిన 'అక్కినేని ఇంటర్ నేషనల్ అవార్డు'ను మంగళవారం రాత్రి హైదరాబాదులో ప్రముఖ తమిళ దర్శకుడు కే. బాలచందర్ కి ప్రదానం చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలిల చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ, "అక్కినేని కుటుంబానికి, నాకు మొదటి నుంచీ మంచి సంబంధాలు వున్నాయి. స్కూలులో  నాగార్జున నాకు సీనియర్. అయితే నేనే అతనికంటే పెద్దవాడిలా కనిపిస్తాను. ఇక బాలచందర్ గారి 'మరో చరిత్ర', 'ఆకలిరాజ్యం' వంటి సినిమాలంటే నాకెంతో ఇష్టం.ఈ అవార్డు వారికి ప్రదానం చేయడం ఎంతో సమంజసంగా ఉంది" అన్నారు. తెలుగు సినిమా సమస్యలని త్వరలోనే పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు. వీరప్ప మొయిలీ చెబుతూ, "అక్కినేని గారు నా అభిమాన నటుడు. ఆయన నటించిన 'దేవదాసు' సినిమా నన్నెంతో ఆకట్టుకుంది. ఆ స్థాయిలో ఇండియాలో ఎవరూ నటించలేదు. ఇక బాలచందర్ గారు గొప్ప దర్శకులలో ఒకరు" అన్నారు. అక్కినేని మాట్లాడుతూ, "బాలచందర్ గారు తమిళ దర్శకుడైనా తెలుగ పరిశ్రమతో ఆయనకెంతో అనుబంధం ఉంది" అన్నారు. సన్మాన గ్రహీత బాలచందర్ చెబుతూ, "నా వయసిప్పుడు 81. అక్కినేని వయసు 87. ఆయనని హీరోగా తీసుకుని 'మరో చరిత్ర'ను రీమేక్ చేయాలని ఉంది" అన్నారు. నాగార్జున మాట్లాడుతూ, "నేను శివ, గీతాంజలి చిత్రాలు చేయడానికి బాలచందర్ గారే స్పూర్తి.ఆయన ఈ అవార్డుని స్వీకరించి, దీని విలువని పెంచారు" అన్నారు. బాలచందర్ కు మెమెంటో తో బాటు 5 లక్షల నగదు కూడా అవార్డు కింద ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో ఇంకా టి.సుబ్బరామిరెడ్డి, అమల, అక్కినేని కుటుంబ సభ్యులు, ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

సదా కి ఒక సినిమా వచ్చింది

 
 
 
 
     'జయం' సినిమాతో కధానాయికగా పరిచయమైన సదా ఆ తర్వాత కొన్ని సినిమాలలో చేసినా అంతగా రాణించలేదనే చెప్పాలి.  అటు తమిళంలో కూడా క్లిక్ కాలేకపోయింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగులో ఓ చిత్రంలో నటిస్తోంది. శివాజీ హీరోగా సూర్యచక్ర పిక్చర్స్ నిర్మించే సినిమాలో సదాని కధానాయికగా ఎంపిక చేసారు. ఎస్.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభమవుతుంది. హాస్యభరితంగా రూపొందే ఈ చిత్రాన్ని తాడి గనిరెడ్డి నిర్మిస్తున్నారు. ఎం.ఎస్.నారాయణ, కృష్ణ భగవాన్, జీవా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తారు.

అందాలతో హడలుగొడుతున్న తాప్సీ

 
 
 
 
         ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు తాప్సి వచ్చి హన్సిక మీద పడిందిప్పుడు. అసలే సినిమాలు లేవనుకుంటుంటే వున్న వాటిని కాస్తా ఈ తాప్సి తన్నుకుపోయేలా వుందని హన్సిక గోలపెడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే, 'ఝుమ్మంది నాదం' చిత్రం ద్వారా పరిచయమైన కధానాయిక తాప్సీ తమిళంలో తాజాగా 'ఆడుకలాం' అనే చిత్రంలో నటించింది. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమాలో తాప్సి రెచ్చిపోయి మరీ అందాలు ప్రదర్శించిందట. ఆ ఫొటోలనే నిర్మాత పబ్లిసిటీకి వాడుతున్నాడు. ఇప్పుడీ ఫొటోలతో కూడిన పోస్టర్లు తమిళనాట కుర్రాళ్లను మత్తెక్కిస్తున్నాయట. తాప్సీకి వస్తున్న ఈ రెస్పాన్స్ చూసి తమిళ మీడియా 'ఇక హన్సిక పని అయిపోయింది. పెట్టీబేడా సద్దుకుని ముంబై వెళ్లిపోవడమే మంచిది' అంటూ కధనాలు రాస్తున్నాయట. దీంతో హన్సికి పైకి 'తాప్సి వల్ల నాకేరీర్ కేమీ ఇబ్బంది లేదు. నేను చేస్తున్న వన్నీ పెద్ద సినిమాలు. తను నాకెక్కడ పోటీ?' అంటూ గంభీరంగా చెబుతున్నప్పటికీ లోపల మాత్రం గుబులుగానే వుందట. అసలే తెలుగులో మార్కెట్ లేక బాధపడుతుంటే, 'ఇక్కడ కూడా ఇదేం బాధరా బాబూ' అంటూ వాపోతోందట!

తెర నిండా తమన్నా అందాలే!


 
 
 
 
      ఇప్పుడు తమన్నా కూడా తగుదునమ్మా అంటూ పోటీకి దిగింది. ఎందులో అనుకుంటున్నారూ... ఎక్స్ పోజింగ్ లో! ఇన్నాళ్లూ తన అందాలను  కాస్త కాస్తగా చూపిస్తూ వచ్చిన ఈ మరాఠీ భామ ఇప్పుడు, 'సరిలేరు నాకెవ్వరూ..' అంటూ ఒక్కసారిగా డోసు పెంచేసింది. 'సిరుతై' అనే తమిళ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన అందాలను తెర నిండా విరజిమ్మనుంది. ఆమధ్య తెలుగులో వచ్చిన 'విక్రమార్కుడు' చిత్రానికిది రీమేక్. తెలుగులో అనుష్క చేసిన క్యారెక్టర్ ని అక్కడ తమన్నా చేస్తోంది. అయితే, అనుష్క కన్నా కాస్త మోతాదు పెంచి హాట్ హాట్ గా నటించిందట. ఇప్పుడు కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ కూడా అయింది. 'ఇన్నాళ్లూ చూసిన తమన్నా వేరు, ఇప్పుడీ సినిమాలో కనిపించే తమన్నా వేరు' అంటున్నారు తమిళ సినీజనం. విశేషమేమిటంటే, ఆమధ్య 'ఆవారా' లో తమన్నాతో కలిసి నటించిన కార్తీ ఇందులో కూడా హీరోగా చేసాడు. వీరిద్దరి మధ్యా ఇప్పుడు తెర మీదే కాకుండా, నిజ జీవితంలో కూడా మంచి 'లవ్ స్టోరీ' నడుస్తోందని కోలీవుడ్ లో బాహాటంగానే చెప్పుకుంటున్నారు.  

లక్కీ చాన్స్ కొట్టేసిన త్రిష


 
 
 
 
         త్రిష కి ఇప్పుడు టైం బాగున్నట్టుంది. వరసగా పెద్ద హీరోల సినిమాలు చేసేస్తోంది. ఇటీవలే కమల్ తో 'మన్మధ బాణం' చేసింది. ఇప్పుడు తాజాగా రజనీకాంత్ తో కూడా చేయనుంది. రజనీ తనయ సౌందర్య నిర్మిస్తున్న యానిమేషన్ కమ్ లైవ్ యాక్షన్ సినిమాలో తానిప్పుడు రజనీ సరసన చేయనుంది. ఇందులో రజనీ యానిమేషన్ పాత్రనూ, ఒక లైవ్ క్యారెక్టర్ నూ కూడా చేస్తున్నాడు. లైవ్ క్యారెక్టర్ పక్కన విజయ లక్ష్మి ('చెన్నై 28' ఫేం) నటిస్తుండగా, లైవ్ క్యారెక్టర్ సరసన త్రిషను ఎంపిక చేసారు. మొదట్లో ఈ పాత్రకు విద్యాబాలన్ ని అనుకున్నారు. యానిమేషన్ కు సంబంధించిన షూటింగ్ వర్క్ పూర్తి కాగా, లైవ్ యాక్షన్ కు చెందిన షూటింగ్ చేయాల్సి ఉంది. ఈ బాధ్యతను ప్రముఖ దర్శకుడు కె.యస్.రవికుమార్ స్వీకరించారు. గతంలో ఈ చిత్రానికి 'సుల్తాన్ ద వారియర్' అనే టైటిల్ అనుకున్నారు. తర్వాత 'హర'గా మార్చారు. చివరికిప్పుడు దీని పేరును 'రాణా'గా కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది.

Thursday, January 6, 2011

ఫిబ్రవరి 13 న హాస్య స్వర్ణోత్సవం


 
 
 
 
       ప్రముఖ హాస్య నటుడు దివంగత రాజబాబు జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 13 న ఆయన పేరిట హాస్య స్వర్ణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రాజబాబు పుట్టిపెరిగిన రాజమండ్రి నగరంలో ఈ కార్యక్రమాన్ని వేలాది మంది అభిమానుల సమక్షంలో జరపనున్నట్టు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా గోదావరీ తీరాన తొమ్మిది అడుగుల రాజబాబు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారాయన. ఇది రాజబాబు 75 వ జన్మదినం కాబట్టి, తెలుగు సినీ రంగానికి చెందిన 75 మంది హాస్యనటులను ఘనంగా సత్కరిస్తామన్నారు. వీరిలో సీనియర్ నటుడిని రాజబాబు అవార్డుతో ప్రత్యేకంగా సన్మానిస్తామన్నారు. ఇంత మంది హాస్య నటులని ఒకే వేదికపై సన్మానించడం గిన్నిస్ రికార్డు అవుతుందట.   

త్రిషకు వార్నింగ్ వెళ్లిందట!


 
 
 
 
           కధానాయిక త్రిష మొదటి నుంచీ ఏదో ఒక రూపంలో వార్తల్లోనే ఉంటోంది. కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో ఆమె న్యూడ్ వీడియో అంటూ వచ్చిన ఫూటేజ్ ఓ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత త్రిష మందు, పబ్బులూ అంటూ తిరుగుతోందంటూ కొన్ని వార్తలు... మొన్నా మధ్య మాదకద్రవ్యాల కేసులో ఆమె పేరు రావడం.. ఏ హీరోయిన్ కీ రానంత నెగెటివ్ పబ్లిసిటీ త్రిషకు వచ్చింది. ఇప్పుడు ప్రేమాయణానికి సంబంధించిన వార్తలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 'మన్మధ బాణం' చిత్రం షూటింగ్ సమయంలో ఆ చిత్ర నిర్మాత ఉదయనిధి స్టాలిన్ తో త్రిష ప్రేమాయణం మొదలైంది. ఉదయనిధి మరెవరో కాదు, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి మనవడు. ఇంకా చెప్పాలంటే, ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ కి తనయుడు. ఇప్పుడు ఉదయ హీరోగా రూపొందనున్న సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్ గా తీసుకున్నాడు. ఈ ప్రేమాయణం వార్త కాస్తా స్టాలిన్ దృష్టికి వెళ్లడంతో ఆమెకు గట్టి వార్నింగ్ వెళ్లినట్టు, దాంతో త్రిష తల్లిదండ్రులు కంగారుపడుతున్నట్టు తెలుస్తోంది. తమ కొడుకుని ఈ అమ్మడే ముగ్గులోకి దింపిందనీ, వదిలేస్తే అతని కెరీర్ పాడైపోతుందనీ స్టాలిన్ కోపంతో ఉన్నాడట. ఈ వ్యవహారం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి!
 


'ఎంతమంది వున్నా పర్వాలే'దంటోన్న దీక్షా సేథ్


 
 
 
 
          ఇప్పుడు టాలీవుడ్ లో కుర్ర హీరోలనే కాకుండా, సీనియర్ హీరోలని కూడా ఆకట్టుకుంటున్న కధానాయిక గా దీక్షా సేథ్ ను చెప్పుకోవచ్చు.  రవితేజ 'మిరపకాయ్' లోనూ, గోపీచంద్ 'వాంటెడ్' లోనూ  దర్శకులు ఎలా చేయమంటే అలా తన అందాలను విశాలంగా ఆరబోసిందట. అందుకే, ఇప్పుడు చాలామంది తనే కావాలని 'దీక్ష' పడుతున్నారు. ఇదిలావుంచితే,  ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల చిత్రాలలో నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదంటోంది దీక్ష.  'అటువంటి సినిమాల్లో నటించడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. దానికి కారణం ఇన్ సెక్యురిటి. అయితే, నాకా బాధ లేదు. నేనెవరికీ కంగారుపడిపోను. ఎంతమంది వున్నా నాకేం పర్వాలేదు. వేదంలో చేసాను కదా? అయినా  నాకు పేరొచ్చింది కదా?'  అంటోంది. ప్రస్తుతం తను తెలుగు నేర్చుకుంటోంది. 'మరో ఏడు నెలలలో నా డబ్బింగ్ నేనే చెప్పేసుకుంటాను'  అని కూడా చెబుతోంది.

హృతిక్ ని కష్టపెడుతున్న దర్శకుడు

 
 
 
 
            బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఇప్పుడు దుబాయ్ లో వున్నాడు. హాలిడే ని గడపడానికి ఫేమిలీతో వెళ్లాడు. అయితే, అక్కడికెళ్లి కూడా పొద్దున్నే లేచి జిమ్ కి వెళుతున్నాడు. రెండు గంటలపాటు కఠోర వ్యాయామం చేస్తున్నాడు. హాలిడే కెళ్లి ఇదేమిటి, అనుకుంటున్నారా? మరదే.... దర్శకుడు కరణ్ జొహార్ ఇచ్చిన ఆర్డర్ ని అమలు చేస్తున్నాడక్కడ. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, మరో నెల రోజుల్లో చేయబోయే సినిమా కోసం పెర్ఫెక్ట్ బాడీ కావాలని కరణ్ చెప్పడంతో, హృతిక్ కి ఈ పాట్లు తప్పడం లేదు. గతంలో అమితాబ్ నటించిన 'అగ్ని పథ్' చిత్రాన్ని హృతిక్ తో కరణ్ రీమేక్ చేస్తున్నాడు. ఆ చిత్రం కోసమే ఈ తతంగమంతా. ఈ సినిమాని చాలా ప్రెస్టేజియాస్ గా తీయాలని వీళ్లిద్దరూ భావిస్తున్నారట.

రెహ్మాన్ తాజా మూజిక్ ఆల్బమ్


 
 
 
 
           భారతీయ సినీ సంగీతాన్ని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించి, దీనికి మహోన్నతమైన గౌరవాన్ని తీసుకు వచ్చిన ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహ్మాన్ తొలిసారిగా ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆల్బమ్ ను తీసుకువస్తున్నాడు. ప్రముఖ పాప స్టార్ డిడో తో కలిసి ఆయన దీనిని రూపొందించాడు. దీనికి సంబంధించిన కొన్ని క్లిప్స్ తో కూడిన వరల్డ్ ప్రీమియర్ ను రెహ్మాన్ తాజాగా తన వెబ్ సైట్ లో ఉంచాడు. డిడో తో కలిసి ఆయనీ ఆల్బమ్ లో పాటలు పాడాడు. ఇది త్వరలో మార్కెట్ లో రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంచితే, తన తాజా హాలీవుడ్ సినిమా '127 అవర్స్' నిన్ననే బ్రిటన్ లో విడుదలైంది. అన్నట్టు, ఈరోజు (జనవరి 6) రెహ్మాన్ తన 45 వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు.   

వేలానికి 'బృందావనం' కిరీటం, ఫ్లూట్


 
 
 
 
         టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) పేద కళాకారుల సహాయార్ధం కొన్ని సినిమాలలో ఆయా హీరోలు ఉపయోగించిన వస్తువుల్ని వేలానికి పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా 'బృందావనం సినిమాలో యన్టీఆర్ వాడిన కిరీటాన్ని, ఫ్లూట్ ను ఆక్షన్ కు పెట్టారు. ఈ విషయాన్ని ఈరోజు (జనవరి 6 ) హైదరాబాదులో 'మా' కార్యాలయంలో 'మా' సభ్యులు తెలిపారు. 'మా' అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ, "గతంలో 'అదుర్స్' సినిమాలోని కోటును, 'మగధీర' లోని కత్తిని, 'సింహా'లోని గొడ్డలిని ఆక్షన్ కి పెట్టాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అడగగానే దిల్ రాజు తమ 'బృందావనం' సినిమాలోని కిరీటం, ఫ్లూట్ ని ఇచ్చారు. వీటికి సంబంధించిన వివరాలు 'మా' వెబ్ సైట్ లో పెడుతున్నాం. అభిమానులు బాగా ఆదరించి దీనిని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం. ఆక్షన్ లో పాల్గొనడానికి చివరి తేదీ జనవరి 24 " అన్నారు. దిల్ రాజ్ చెబుతూ, "ఇక నుంచి నా ప్రతి సినిమాకు పేద కళాకారుల సహాయార్ధం లక్ష రూపాయలిస్తాను" అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా శివకృష్ణ, హేమ, కాదంబరి కిరణ్, శేఖర్ కూడా పాల్గొన్నారు. సో... అభిమానులు ట్రై చేయచ్చు!

'అలా మొదలైంది' ప్లాటినం డిస్క్ ఫంక్షన్

నాని హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వంలో దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న 'అలా మొదలైంది' చిత్రం పాటల ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఈరోజు (జనవరి 6 ) హైదరాబాదులోని మ్యూజిక్ వరల్డ్ లో జరిగింది. ఈ సందర్భంగా గెస్ట్ గా పాల్గొన్న దర్శకుడు కృష్ణ వంశీ మాట్లాడుతూ, "నందిని నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసింది. అప్పుడు ఏదైనా తనకు నచ్చక పొతే నిర్మొహమాటంగా చెప్పేది. ఇక ఈ సినిమా పోస్టర్ నాకు బాగా నచ్చింది. సినిమా ఎప్పుడు చూద్దామా అన్న క్యురియాజిటీతో వున్నాను" అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా బోయపాటి శ్రీను, నందినీ రెడ్డి, నాని, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యాబాలన్ కి గాలి ఇటు మళ్లింది!

బాలీవుడ్ భామ విద్యాబాలన్ కి ఉన్నట్టుండి ఇప్పుడు సౌత్ మీదకి, అందులోనూ టాలీవుడ్ మీదకి దృష్టి మళ్లింది. తెలుగు సినిమాల్లో చేయాలని వుందని చెబుతోంది. పైగా, టాలీవుడ్ నుంచి అవకాశాలు కూడా వస్తున్నాయట. "మా అమ్మా, నాన్న కూడా దక్షిణాది చిత్రాల్లో చేయమని ఎప్పటి నుంచో సలహా ఇస్తున్నారు. నాకు కూడా తెలుగు సినిమాలంటే ఇష్టం. బాగా రిచ్ గా తీస్తారు. టాలీవుడ్ నుంచి ఎప్పటి నుంచో ఆఫర్లు వస్తున్నాయి. మంచి ఆఫర్ చూసుకుని చేస్తాను" అంటోంది విద్య. గతంలో 'శంకర్ దాదా జిందాబాద్' సినిమా కోసం అడిగినప్పుడు ఈవిడ రేటెక్కువ చెప్పి, తప్పించుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో తనని పట్టించుకునే వాళ్లు లేకపోవడంతో టాలీవుడ్ మీద విద్య ప్రేమ ఒలకబోస్తోంది. అయినా, ఇప్పుడు ఈమెను బుక్ చేసుకోవడానికి ఇక్కడ ఎవరూ అంత రెడీగా లేరులెండి!
Related Posts Plugin for WordPress, Blogger...