e-cigarette review Ping Yahoo GOSSIPS: February 2011

Monday, February 28, 2011

వైభవంగా వైజయంతీ మూవీస్ 'శక్తి' ఆడియో ఫంక్షన్

వైజయంతీ మూవీస్ యన్టీఆర్ కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో నిర్మించిన 'శక్తి' సినిమా ఆడియో ఫంక్షన్ ఈ రోజు (ఫిబ్రవరి 27) హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణంలో యన్టీఆర్ అభిమానుల సమక్షంలో వినూత్నంగా, వైభవంగా జరిగింది. అందమైన భారీ వేదికపై పలు డ్యాన్స్ కార్యక్రమాలతో అభిమానులను అలరించే విధంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ సినిమాలోని పాటలకు యన్టీఆర్, ఇలియానా స్టేజ్ పై డ్యాన్స్ లు చేయడం విశేషం. ఈ డ్యాన్సులకి అభిమానులు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేసారు. పాటల సీడీలను హీరో యన్టీఆర్ రిలీజ్ చేసి, జాకీ ష్రాఫ్, ఇలియానా, మెహర్ రమేష్ తదితరులకు అందజేశాడు.
       ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ, "మా బ్యానర్ లో నందమూరి వంశానికి చెందిన మూడు తరాల హీరోలతో సినిమాలు నిర్మించే అదృష్టం దక్కింది. రేపు బాలయ్య బాబు తనయుడితో చేయడానికి కూడా మేం రెడీగా వున్నాం. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే, యన్టీఆర్ విశ్వరూపాన్ని ఇందులో చూడచ్చు. అంతటి స్థాయిలో ఆయన నటన వుంటుంది. మెహర్ రమేష్ 500 మంది టెక్నీషియన్లతో ఈ సినిమాను వివిధ లోకేషన్లలో షూట్ చేసారు. మా సంస్థ ప్రతిష్టను పెంచే స్థాయిలో సినిమా వుంటుంది" అన్నారు.
         దర్శకుడు మెహర్ రమేష్ చెబుతూ, "నా చిన్నప్పుడు వైజయంతీ మూవీస్ సినిమా వచ్చిందంటే, మా విజయవాడలో అప్సరా థియేటర్ కి వెళ్లి, లైన్ లోనిలబడి టికెట్ తీసుకుని సినిమా చూసేవాడిని. అలాంటి సంస్థలో ఈ భారీ సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. బడ్జెట్టు, టైము అనే లిమిటేషన్లు పెట్టుకోకుండా సినిమాని తీయమని నిర్మాత దత్తు గారు మాకు చెప్పారు. ఒక విధంగా ఈ సినిమాకు ఆయనే ప్రాణం. ఆయనకు సినిమా నచ్చితే జనానికి నచ్చినట్టే! ఆయన జడ్జిమెంటు అంతలా వుంటుంది. యంగ్ టైగర్ యన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడిందులో. ఐదు డైమంషన్స్ లో అతను కనపడతాడు. శక్తి పీఠాలకు సంబంధించిన కథ ఇది. యన్టీఆర్ మాత్రమే చేయగల క్యారెక్టర్ ఇది. సినిమాని మన దేశంలోనూ, విదేశాలలోనూ ఎన్నో లోకేషన్లలో షూట్ చేసాం.ఎంతో ప్రయాసతో కుంభమేళాలో కూడా షూటింగ్ చేసాం" అన్నారు. 
       హీరో యన్టీఆర్ మాట్లాడుతూ, "నేనెప్పుడూ ఇలా స్టేజ్ మీద డ్యాన్స్ చేయలేదు. ఇదే తొలిసారి. మీరు ఇంత ప్రేమతో ఈ ఫంక్షన్ కి అతిథులుగా వచ్చారు కాబట్టి చేయాలనిపించింది. ఈ రోజు ఈ వేడుకను చూసి తాతగారు ఎంతగానో ఆనందపడతారనుకుంటున్నాను. మెహర్ రమేష్ నా ఆప్తమిత్రుడు. ఓసారి మలేసియాలో 'ఓ కథ చెబుతాను విను' అంటూ ఈ 'శక్తి' కథ చెప్పాడు. అతనీ కథను ఎవరితో చేద్దామనుకున్నాడో కానీ, నేను మాత్రం 'నాతో కాకుండా ఇంకెవరితో చేస్తావ్?' అన్నాను. మాకు దత్తు గారు తోడయ్యారు. ఈ ప్రాజక్టు అలా మొదలైంది. 'ఆది' సినిమా నుంచీ కూడా మణి అన్న నాకు మంచి సాంగ్స్ ఇస్తున్నాడు. ఇందులో కూడా అదరగొట్టాడు. అలాగే కెమెరా మేన్ సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ అద్భుతంగా వుంది. ఎడిటింగ్ లో ఓ పాటలో నన్ను నేను చూసుకుని నమ్మలేకపోయాను. అలాగే, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొత్త లోకాలు క్రియేట్ చేసాడు. అందరూ ఎవరికి వాళ్లు అద్భుతంగా వర్క్ చేసారు" అన్నారు.
       చివర్లో, ఈ సినిమాలోని యన్టీఆర్ పాత్ర 'రుద్ర'కు సంబంధించిన వీరరసంతో కూడిన ఫోటో పోస్టర్ ను జాకీ ష్రాఫ్ వేదికపై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మంజు భార్గవి, కె.యస్.రామారావు, బోయపాటి శ్రీను, హీరోయిన్లు ఇలియానా, మంజరి, మణిశర్మ, సమీర్ రెడ్డి, నిర్మాత కుమార్తెలు స్వప్నా దత్, ప్రియాంకా దత్ తదితరులు పాల్గొన్నారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ వేడుక ప్రారంభానికి ముందు యన్టీఆర్ అభిమానులు వేలాది మంది నగరంలో బైక్ ర్యాలీని నిర్వహించారు.

నేటి వార్తలు....టూకీగా

*  ప్రస్తుతం సంపత్ నందితో ఓ సినిమా ఒప్పుకున్న రామ్ చరణ్ త్వరలో వి.వి.వినాయక్ దర్శకత్వంలో కూడా మరో చిత్రాన్ని చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది.
*  'అమ్మ' రాజ శేకర్ దర్శకత్వంలో శ్రీహరి కథానాయకుడుగా నటిస్తున్న 'ముద్ర' సినిమా చివరి షెడ్యులు షూటింగ్ రేపటి (మార్చి 1) నుంచి హైదరాబాదులో జరుగుతుంది.
*  కమేడియన్ అలీ హీరోగా వేమగిరి దర్శకత్వంలో రూపొందిన 'తిమ్మరాజు' సినిమా మార్చి 11 న రిలీజ్ అవుతుంది.
*  'వేదం' తమిళ రీమేక్ నుంచి స్నేహా ఉల్లాల్ ని తొలగించి ఆమె స్థానంలో జాస్మిన్ ని తీసుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే శింబు, స్నేహాలపై కొంత షూటింగ్ చేసారు.
*  తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ 'మగధీర' ను హిందీలో రణభీర్ కపూర్ తో రీమేక్ చేయడానికి నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నాడు.
*  తనపై  కుళ్ళు జోకుల సర్క్యులేషన్, వెబ్ సైట్ (I HATE BALAYYA .COM) నిర్వహణపై బాలకృష్ణ సైబర్ క్రైమ్స్ డీసీపీకి కంప్లయింట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సైట్ ను ఆస్ట్రేలియా నుంచి ఓ తెలుగు వ్యక్తీ నిర్వహిస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు.

మణిరత్నం తో మహేష్ బాబు సినిమా ఖరారు

మహేష్ బాబు ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా వున్నాడు. దానికి కారణం నిన్న (ఫిబ్రవరి 27) చెన్నైలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ను కలిసి, ఆయనతో చాలా సేపు మాట్లాడాడు. మణి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయనున్నాడన్న వార్తలు గత కొంత కాలంగా వస్తున్న సంగతి తెలిసిందే. అదిప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. మహేష్ కూడా దీనిని కన్ఫర్మ్ చేసాడు.
              "ఈ రోజు నా జీవితంలో ఎంతో ఆనందకరమైన దినం. లెజెండరీ మణి సార్ ని కలిసాను. ఆయనతో సినిమా చేయాలన్న నా కల నిజమవుతోంది. మణి సార్ తో సినిమా చేస్తున్నాను" అన్నాడు మహేష్. చారిత్రాత్మక కథాంశంతో మణిరత్నం రూపొందించే భారీ చిత్రంలో మహేష్ నటిస్తున్నాడు. మొదటి నుంచీ ఇందులో ప్రధాన హీరోగా మహేష్ నే తీసుకోవాలని మణి ఆలోచిస్తూ వచ్చాడు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

అనుష్కకి 'బాడీ' సమస్య

కథానాయిక అనుష్కకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. అదేమిటంటే, ఓసారి సన్న పడాలి... మరోసారి కాస్త ఒళ్లు తెచ్చుకుని బొద్దుగా తయారవ్వాలి. ఎందుకంటారా... తానిప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో నటిస్తోంది కదా... తమిళ ప్రేక్షకులేమో హీరోయిన్లు కాస్త బొద్దుగా ఉంటేనే ఇష్టపడతారు. సన్నగా నాజూగ్గా వుంటే వాళ్లకి నచ్చదు. మన తెలుగు వాళ్లకైతే, బొద్దుగా వుంటే నచ్చదు. మెరుపు తీగలా, సన్నజాజి తీగలా వుండాలి! ఇప్పుడీ ఇబ్బందిని అనుష్క ఎదుర్కుంటోంది.
           "కోలీవుడ్ కి, టాలీవుడ్ కీ ఒకేసారి డేట్లు ఇస్తే ఇక మా పని అయిపోయినట్టే. బాడీ ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకని రెండు షూటింగులకీ కాస్త గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. తమిళ్ సినిమా షూటింగుకి రెడీ అయ్యే ముందు బాగా తిని ఒళ్లు పెంచాలి. మళ్లీ తెలుగు షూటింగుకి వచ్చే ముందు డైటింగులు, వర్కౌట్లు చేసి సన్నబడాలి. ఇది చాలా కష్టంతో కూడిన వ్యవహారం. ఇలా వుంటాయి మా బాధలు " అంటోంది. అందుకే, చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట ఈ మంగుళూరు బ్యూటీ!

ఏ.ఆర్.రెహ్మాన్ కి ఆస్కార్ నిరాశ

సంగీత మాంత్రికుడు ఎ.ఆర్.రెహ్మాన్ కు ఈసారి ఆస్కార్ అవార్డుల్లో నిరాశ ఎదురైంది. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న '127 అవర్స్' సినిమాకు అవార్డు రాలేదు. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో రెహ్మాన్ కు ఈ సినిమా పరంగా ఆస్కార్ నామినేషన్ లభించిన సంగతి తెలిసిందే. అయితే, 'ది సోషల్ నెట్ వర్క్' సినిమా ఈ అవార్డును సొంతం చేసుకుంది. దీనికి సంగీతాన్ని సమకూర్చిన ట్రెంట్ రేజ్నార్, ఆటికస్ రాస్ సంయుక్తంగా బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డును అందుకున్నారు. రెండేళ్ల క్రితం 'స్లం డాగ్ మిలియనీర్' సినిమాకి రెహ్మాన్ రెండు ఆస్కార్లు అందుకున్న సంగతి తెలిసిందే!

త్రిష ప్రయత్నాలు ఫలించేనా?

త్రిష ఈమధ్య రెచ్చిపోయి మరీ పత్రికలకి పోజులిస్తోంది. సౌత్ నుంచి వచ్చే మేగజైన్లకే కాకుండా, ముంబై నుంచి వచ్చే మేగజైన్లకి కూడా హాట్ హాట్ పోజులిస్తూ అందరి మతులూ పోగొడుతోంది. ఈ ఫొటో సేషన్లకి ప్రత్యేకంగా టైం కూడా కేటాయిస్తోంది. త్రిష ఇప్పుడు ఎందుకిలా రెచ్చిపోతూ పోజులిస్తోందన్న విషయాన్ని ఎంక్వైర్ చేస్తే అసలు విషయం బయటపడింది. తన సెక్సీ లుక్కులతో బాలీవుడ్ దృష్టిలో పడడానికట!
               తను నటించిన తొలి హిందీ సినిమా 'కట్టా మీటా' పెద్ద ఫ్లాప్ అవడంతో ఈ చెన్నై భామ ఆమధ్య బాగా అప్ సెట్ అయింది. మళ్లీ అంతలోనే తేరుకుని, ఏది ఏమైనా బాలీవుడ్ లో సక్సెస్ అవ్వాలని డిసైడ్ అయిందట. అందుకని అక్కడ సినిమా అవకాశాలు పొందడానికి ఇప్పుడిలా హాట్ హాట్ గా కనిపిస్తోంది. "సౌత్ కీ, హిందీకీ కాస్త తేడా వుంది. అక్కడ సక్సెస్ కావాలంటే బాగా హాట్ గా కనపడాలి. లేకపోతే కష్టం. అందుకే ఈ ప్రయత్నాలు" అంటోంది నవ్వుతూ. మరి, వ్రతం చెడినా త్రిషమ్మకు ఫలితం దక్కుతుందో, లేదో చూద్దాం!

'బ్రేకింగ్ న్యూస్ బాబూరావ్' గా శివాజీ

హైదరాబాదులోని ఓ ఎఫ్.ఎం. రేడియో 'బ్రేకింగ్ న్యూస్ బాబూరావ్' పేరిట ఓ సెటైరికల్, ఫన్నీ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంటుంది. ఇప్పుడీ పేరుని ఓ సినిమాకి టైటిల్ గా పెట్టుకున్నారు. శివాజీ హీరోగా తేజస్వి క్రియేషన్స్ నిర్మించే ఈ సినిమాకి నూతన దర్శకుడు కర్రి బాలాజీ దర్శకత్వం వహిస్తాడు. ఈ విషయాన్ని ఈ రోజు ఉదయం హైదరాబాదులో జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాతలు తెలియజేసారు. దర్శకుడు చెప్పిన కథ చాలా సరదాగా ఉండడంతో చేయడానికి ఒప్పుకున్నాననీ, సినిమా అంతా ఫన్నీగా సాగుతుందనీ హీరో శివాజీ చెప్పాడు. ఈ చిత్రాన్ని తిరుపతి రావు, పెద్దిరెడ్ల త్రినాధ్, చల్లా రెడ్డి నిర్మిస్తున్నారు. సోమా విజయ ప్రకాష్ సమర్పకుడిగా వ్యవహరిస్తారు. శ్రీలేఖ సంగీతం అందిస్తోంది.

Friday, February 11, 2011

ఒకే రోజు నాలుగు సినిమాల రిలీజ్

ఈమధ్య కాలంలో ఎప్పుడూ జరగనట్టుగా ఫిబ్రవరి 25 న, ఒకే రోజున నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ' రాజ్', 'అహ నా పెళ్ళంట', 'కుదిరితే కప్పు కాఫీ', 'యమకంత్రీ' సినిమాలు ఆ రోజున విడుదలవుతున్నాయి. వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం వహించిన 'రాజ్' లో సుమంత్ హీరోగా, ప్రియమణి, విమలా రామన్ హీరోయిన్లుగా నటించారు. 'అహ నా పెళ్ళంట'లో అల్లరి నరేష్ హీరోగా నటించగా, 'కుదిరితే కప్పు కాఫీ' సినిమాలో వరుణ్ శందేశ్ హీరోగా నటించాడు. ఇక ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన 'యమకంత్రి' సినిమాలో విజయ్, నయనతార జంటగా నటించారు. ఈ నాలుగు సినిమాల్లో ఏవి హిట్ అవుతాయో, ఏవి ఫట్ అవుతాయో చూడాలి!

నయనతారకి వేలెంటైన్స్ డే సెలెబ్రేషన్ లేదా?

ప్రేమికులకి వేలెంటైన్స్ డే అయిన ఫిబ్రవరి 14 చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు ఎన్ని పనులున్నా, ఎక్కడున్నా కూడా ప్రేమికులు, అందులోనూ పెళ్లి కాని ప్రేమికులు తప్పకుండా కలుసుకుని, హ్యాపీగా సెలెబ్రేట్ చేసుకుంటారు. అయితే, ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ ప్రేమికులుగా, ఖరీదైన లవ్వర్స్ గా పేరుతెచ్చుకున్న ప్రభుదేవా, నయనతారలు ఆ రోజు అసలు కలుసుకునేలానే లేరు. ఎందుకంటే, ఆ రోజు ఇద్దరూ చెరో చోటా ఉంటున్నారట! ప్రభుకైతే అస్సలు ఖాళీ లేదట. ఓపక్క తను జయం రవి, హన్సికలతో రూపొందించిన 'ఎంజియమ్ కాదల్' సినిమా ఫిబ్రవరి 26 న రిలీజ్ అవుతోంది. ఆ సినిమా ఫినిషింగ్ వర్క్ లో చాలా బిజీనట. అలాగే, మరో పక్క ముంబై లో సంజయ్ లీలా భన్సాలీ ఇతని దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నిర్మిస్తున్న చిత్రం క్లైమాక్స్ కి సంబంధించిన డిస్కషన్స్ వున్నాయి. 'ఇన్ని పనులతో ఇక వేలెంటైన్స్ డే సెలెబ్రేషన్ కి టైమెక్కడ?' అంటున్నాడు ప్రభు. మరి, ఇప్పుడే ఇలా అంటే, రేపు పెళ్లయ్యాక అసలు నయన్ కి టైం కేటాయిస్తాడా? 

నిఖిల్ హీరోగా 'వీడు తేడా' ప్రారంభం

నిఖిల్ హీరోగా నూతన దర్శకుడు చిన్ని కృష్ణ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న 'వీడు తేడా' సినిమా షూటింగ్ ఈ రోజు (ఫిబ్రవరి 10) ఉదయం హైదరాబాదులోని అన్నపూర్ణా స్టుడియోలో ప్రారంభమైంది. తొలి షాట్ కు ప్రముఖ నిర్మాత రామానాయుడు కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ నిచ్చారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ, "నాకిది ఏడవ సినిమా. కథ, దానిని దర్శకుడు చెప్పిన విధానం నచ్చాయి. నాకు మంచి సినిమా అవుతుందనుకుంటున్నాను" అన్నాడు.  దర్శకుడు చిన్ని కృష్ణ చెబుతూ, "దర్శకుడు వినాయక్ వద్ద పనిచేసాను. అలాగే, 'కొత్త బంగారు లోకం' సినిమాలో హాస్టల్ వార్డెన్ గా నటించాను. ఇది నా తొలి సినిమా. బాగా తీస్తానన్న నమ్మకం వుంది" అన్నారు. చక్రి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో పూజా బోస్ హీరోయిన్ గా నటిస్తోంది.

'గగన'విహారం వర్కౌట్ అవుతుందా?

విడుదలకు ముందే ప్రివ్యూల పరంగా 'గగనం' సినిమాకు శతప్రదర్శనోత్సవాన్ని జరిపేసేలా వున్నాడు నిర్మాత దిల్ రాజు. మొన్న, నిన్న హైదరాబాదులో ప్రివ్యూల మీద ప్రివ్యులు వేసేసిన నిర్మాత ఈ రోజు విశాఖ, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలలో కూడా వేస్తున్నాడు. అభిమానులని, నగర ప్రముఖుల్ని ఈ షోలకి ఇన్వయిట్ చేసాడు. ఈ షోలకి యూనిట్ అటెండ్ అవడానికి ఈ రోజు ప్రత్యేకంగా 10 లక్షలు వెచ్చించి, చార్టెడ్ ఫ్లయిట్ ను కూడా బుక్ చేసాడు. ఈ రోజు పొద్దున్నే అందులో నాగార్జున, ప్రకాష్ రాజ్, దిల్ రాజ్, పూనం కౌర్ తదితర యూనిట్ బృందమంతా బయలు దేరి వెళ్లి, ఆంధ్రా అంతటా చక్కర్లు కొడుతోంది. ఒక్కో షోకి ఒక్కో పట్టణంలో ఉండేలా ప్లాన్ చేసుకుని ఆయా థియేటర్లను విజిట్ చేస్తున్నారు. అక్కడ అభిమానుల కోలాహలం కూడా బాగానే వుంది. ఈ సినిమా ఓ కొత్త తరహా ప్రయోగం కావడంతో, జనం చూస్తారో, లేదోనన్న భయంతో, నిర్మాత ప్రమోషన్ లో భాగంగా ఈ కొత్త పోకడను ఎంచుకున్నాడన్న మాట!

ఆర్ధిక ఇబ్బందుల్లో రాధిక చెల్లి నిరోషా

సినిమా ఇండస్ట్రీలో తారలు లైమ్ లైట్ లో వున్నప్పుడు సంపాదించుకున్నది జాగ్రత్త చేసుకోకపోతే ఆ తర్వాతి కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ బాపతు మనుషుల్ని సినిమా రంగంలో చాలా మందిని చూసాం. రాధిక చెల్లెలు, ఒకప్పటి కథానాయిక నిరోషా కూడా ఇప్పుడీ రకం మనుషుల్లో చేరిపోయింది. ఇరవయ్యేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ సినిమా 'సింధూర పువ్వు' లో తనతో పాటు కలిసి నటించిన రాంకీ ని పెళ్లి చేసుకున్న నిరోషా, ఇప్పుడు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నట్టు తెలుస్తోంది.
         తను ఆర్టిస్టుగా మంచి పొజిషన్ లో ఉండగానే ఈ నటి రాంకీ ని మేరేజ్ చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకి ఇద్దరికీ అవకాశాలు తగ్గాయి. దాంతో నిరోషా టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. అయితే, ఆమధ్య ఈ దంపతులు చెన్నయ్ లోని జెమినీ సర్కిల్ ప్రాంతంలోని పార్శెన్ కాంప్లెక్స్ లో వున్న రెండు ఫ్లాట్స్ ని తనఖా పెట్టి, కార్పొరేషన్ బ్యాంక్ నుంచి 50 లక్షలు అప్పుగా తీసుకున్నారట. ఎన్ని నోటీసులిచ్చినా, తిరిగి ఆ మొత్తం చెల్లించకపోవడంతో సదరు బ్యాంకు అధికారులు ఆ ఫ్లాట్స్ ను వేలం వేయడానికి సిద్ధం అవుతున్నారని కోలీవుడ్ సమాచారం.

ఆ హీరోయిన్ కి వరుసగా మరో ఛాన్సిచ్చిన సిద్ధార్థ్!

ఈ మధ్య కాలంలో ఒక్క హిట్టు కూడా లేకుండా వరుస ఫ్లాపుల్లో వున్న సిద్ధార్థ్ ఖాళీగా మాత్రం లేడు. ఏదో ఒక సినిమా వస్తూనే వుంది. ఇటీవల వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు' సినిమా డిజాస్టర్ అయినప్పటికీ, దిల్ రాజు ఇతనితో మరో సినిమా ప్లాన్ చేసాడు. నూతన దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా 'ఓ మై ఫ్రెండ్' అన్న పేరు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగు బుధవారం నాడు హైదరాబాదులో లాంచనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగును ఫిబ్రవరి 21 నుంచి జరుపుతారు. ఇదిలా ఉంచితే, ఈ సినిమాలో హీరోయిన్ గా నిత్య మీనన్ ని ఎంపిక చేసారట. ఈమెను హీరో సిద్దార్దే రికమండ్ చేసినట్టు తెలుస్తోంది. మరో పక్క సిద్ధార్థ్ ప్రస్తుతం నటిస్తున్న తెలుగు, తమిళ చిత్రం '180' లో కూడా నిత్యానే కథానాయిక. ఒక సినిమా రిలీజ్ కాకుండానే వరుసగా మరో సినిమాలో కూడా నిత్యాకు ఛాన్స్ ఎందుకిచ్చాడబ్బా? అంటూ టాలీవుడ్ జనం వేరే అర్థాలు తీస్తున్నారు!

తన అసోసియేట్ ని పెళ్లాడుతున్న దర్శకుడు

తెలుగులో '7 జి. బృందావనం కాలనీ', 'ఆడువారి మాటలకు అర్థాలు వేరులే' వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ తన దగ్గర అసోసియేట్ గా పనిచేస్తున్న గీతాంజలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. వీరి వివాహ నిశ్చితార్థం ఈ రోజు (ఫిబ్రవరి 10) చెన్నయ్ లో వధువు ఇంట్లో జరిగింది. గీతాంజలి తమిళనాడు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పి.యస్.రామన్ కుమార్తె. ఈ సందర్భంగా పెళ్లి ముహూర్తం కూడా పెట్టారు. జూలై 3 న చెన్నయ్ లోని హోటల్ లీ మెరిడియన్ లో మేరేజ్ జరుగుతుంది. నేటి వేడుకకు రజనీకాంత్, కమల హాసన్, వెంకటేష్, రానా, మణిరత్నం, సుహాసిని, గౌతమి, అబ్బాస్, రీమాసేన్, యువన్ శంకర్ రాజా తదితరులు హాజరయ్యారు. సెల్వ రాఘవన్ గతంలో నటి సోనియా అగర్వాల్ ను వివాహం చేసుకుని, కొన్నాళ్లకు డైవోర్స్ తీసుకున్నాడు.

బర్మాలో సందడి చేసిన రామ్ చరణ్

తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆయన తరఫున రామ్ చరణ్ పెద్దరికాన్ని తీసుకుని పలు ఫంక్షన్లకు హాజరవుతున్నాడు. పైగా, షూటింగులు కూడా ఇంకా ఏమీ స్టార్ట్ కాకపోవడంతో ఈ ఖాళీ సమయాన్నిలా వినియోగించుకుంటున్నాడు. మొన్నామధ్య ముంబైలో జరిగిన ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇర్ఫాన్ పెళ్లి రిసెప్షన్ కి అటెండ్ అయిన చరణ్, తాజాగా మయాన్మార్ (బర్మా) వెళ్లాడు. బ్రిటిష్ వాళ్ల పాలనలో మన తెలుగు వాళ్లు ఎంతో మంది పనుల కోసం అప్పటి బర్మాలోని రంగూన్ వెళ్లి, అక్కడే స్థిరపడిపోయారు. వాళ్లంతా యాంగాన్ నగరంలో 'బర్మా తెలుగు అసోసియేషన్' గా ఓ సంఘం కూడా పెట్టుకున్నారు. ఆ సంస్థ శత వార్షికోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి. వీటికి చీఫ్ గెస్ట్ గా చరణ్ హాజరయ్యాడు.
        అభిమాన హీరో తమ కళ్ళ ముందు ప్రత్యక్షమవడంతో వాళ్లంతా కేరింతలు కొడుతూ రిసీవ్ చేసుకున్నారు. "బర్మాలో నాలుగు లక్షల మంది తెలుగు వాళ్లు వున్నారంటే నమ్మలేకపోతున్నాను. వారు నాపై చూపించిన ప్రేమపూర్వక ఆదరణకి ముగ్దుడినయ్యాను. ఆ అందమైన ప్రదేశం, రుచికరమైన వాళ్ల వంటలు నన్నెంతో ఆకట్టుకున్నాయి" అంటున్నాడు చరణ్. ఈ మాటలు విన్న అల్లు శిరీష్ "నాలుగు లక్షల మందా? అంటే, ముంబై, పూనే, అహ్మదాబాద్ లలో వున్న తెలుగు వాళ్ల కంటే ఎక్కువన్న మాట. అయితే, మన నెక్స్ట్ మార్కెట్ బర్మానే!" అంటూ వ్యాపార దృష్టితో కామెంట్ చేసాడు.

నేటి సినిమా వార్తలు... టూకీగా!

ఈ రోజు (ఫిబ్రవరి 11 ) 'గగనం', 'వస్తాడు నా రాజు' సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
*      వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందే తాజా చిత్రం షూటింగ్ మార్చి 15 న ప్రారంభమవుతుంది.
*      ఈ నెల 25 న రిలీజ్ అవ్వాల్సిన 'యమ కంత్రీ' సినిమా వాయిదా పడింది. మార్చి 4 న రిలీజ్ చేస్తారట.
*      అల్లరి నరేష్ హీరోగా నటించిన 'అహ నా పెళ్ళంట' సినిమాని ఇటీవల మరణించిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు అంకితం చేస్తున్నారు.
*      రఫీ హీరో, దర్శకుడుగా రూపొందే తెలంగాణా ఉద్యమ చిత్రం 'ఇంకెన్నాళ్ళు' పాటల రికార్డింగ్ జరుగుతోంది.
*      'తెలంగాణా జిందాబాద్' పేరుతో మరో ఉద్యమ చిత్రాన్ని ఎం.యస్. గుప్తా నిర్మిస్తున్నారు.
*      ఎల్.బీ.శ్రీరాం, అలీ తాతామనవళ్ళుగా నటించిన 'తిమ్మరాజు' సినిమా ఫిబ్రవరి నెలాఖరున రిలీజ్ అవుతోంది. 
*      రాంగోపాల్ వర్మ తీస్తున్న ఐదు రోజుల సినిమా 'దొంగల ముఠా' మూడో రోజు షూటింగ్ లో వుంది.
*      శ్రీహరి హీరోగా డ్యాన్స్ మాస్టర్ అమ్మ రాజశేకర్ దర్శకత్వంలో 'ముద్ర' పేరుతో ఓ సినిమా తయారవుతోంది.

కాజల్ ఇక బాలీవుడ్ చెక్కేస్తుందా?

పైకి ఎన్ని కబుర్లు చెప్పినా కథానాయికలందరికీ వాళ్ల అంతిమ లక్ష్యం బాలీవుడ్డే అన్న సంగతి మనకు తెలుసు. ఎందుకంటే, హిందీ సినిమాల్లో క్లిక్ అయితే ఇక వాళ్ల పంట పండినట్టే. రీజనల్ లాంగ్వేజెస్ లో ఎన్ని సినిమాలు చేసినా రాని పేరు ఒకటి, రెండు హిందీ సినిమాలు చేస్తే చాలు, వచ్చేస్తుంది. అందుకే, సౌత్ సినిమాలలో చేస్తున్నప్పటికీ హీరోయిన్లంతా బాలీవుడ్ మీద ఓ లుక్కేస్తూనే వుంటారు. ఇప్పుడీ లిస్టులో కాజల్ కూడా చేరింది. తాజాగా ఓ హిందీ చిత్రాన్ని యాక్స్పాట్ చేసింది. తమిళంలో సూపర్ హిట్ అయిన 'సింగం' సినిమాని అజయ్ దేవగణ్ హీరోగా హిందీలో ఇప్పుడు రిమేక్ చేస్తున్నారు. ఇందులో మొదట అనుష్కని తీసుకోవాలనుకున్నారు. అయితే, ఆమె బాలీవుడ్ కి వెళ్లడానికి ఇంటరెస్ట్ చూపించక పోవడంతో, ఇప్పుడా అవకాశం కాజల్ కి దక్కింది. సో... తనక్కడ కూడా సక్సెస్ అవుతుందేమో చూద్దాం!

రేపే నాగార్జున 'ఢమరుకం' ప్రారంభం

నాగార్జున హీరోగా నటించే సోషియో ఫ్యాంటసీ చిత్రం 'ఢమరుకం' షూటింగ్ రేపే (ఫిబ్రవరి 12) ప్రారంభమవుతోంది. మినిమం గ్యారంటీ దర్శకుడిగా కామెడీ చిత్రాలు రూపొందించే శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో దీనిని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ నిర్మిస్తున్నాడు.  భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం భారీ సెట్స్ కూడా వేస్తున్నారు. అలాగే ఈ సబ్జక్ట్ కి కాస్ట్యూమ్స్ పరంగా కూడా  రిచ్ నెస్ అవసరమట. ఆ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఫ్యాంటసీ కథాంశం మిళితమైనందువల్ల గ్రాఫిక్స్ కి కూడా ఎంతో ప్రాధాన్యత ఉందనీ, సుమారు 50 నిమిషాల పాటు స్క్రీన్ మీద ఈ గ్రాఫిక్స్ మాయాజాలం ప్రేక్షకులను మరో లోకంలో విహరింపజేస్తుందట. ఇందులో నటించే హీరోయిన్ గా ఇప్పటికే అనుష్కను ఎంపిక చేసారు.   

జెనీలియా పెళ్లికూతురు కానుందా?

చిలిపి కళ్ల సుందరాంగి జెనీలియా త్వరలో ఇక సినిమాలకి గుడ్ బై చెప్పనుందా? ఇక రియల్ లైఫ్ లో సెటిల్ కానుందా? ఇప్పుడు బాలీవుడ్ లో ఈ వార్తలే చక్కర్లు కొడుతున్నాయి. తన చిరకాల మిత్రుడు, సహ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను త్వరలో జెన్నీ పెళ్లి చేసుకోనుందని వార్తలు గుప్పుమంటున్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ తనయుడైన రితేష్ తో జెనీలియా ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. ఇన్నాళ్లూ తమ సాన్నిహిత్యాన్ని గుంభనంగా ఉంచిన ఈ జంట, ఈ మధ్య తమ బంధాన్ని మెల్లిగా బయటపెడుతోంది.
          ఇటీవల బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నాల వెడ్డింగ్ ఎనివేర్సరీలో ఈ జంట అందరి ముందూ కలసి మెలసి తిరిగారు. ఇది చూసిన బాలీవుడ్ జనం 'ఇక త్వరలో వీళ్లిద్దరూ మేరేజ్ చేసుకోవచ్చు. అందుకే తమ బంధాన్ని నలుగురి ముందూ ప్రదర్శిస్తున్నారు' అంటున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొన్నాళ్ళాగాల్సిందే! 

శాటిలైట్ రైట్స్ లో 'దూకుడు'


ఒకప్పుడు తెలుగు సినిమాలకు శాటిలైట్ రైట్స్ రూపంలో మంచి డబ్బులు వచ్చేవి. చిన్నా చితకా సినిమాలకి కూడా లక్షల్లో వచ్చేవి. జీటీవీ తమ తెలుగు చానెల్ స్టార్ట్ చేసాక ఇది మరీ ఎక్కువైపోయింది. ఫ్లాప్ సినిమాలకు కూడా కోట్లు ఆఫర్ చేయడం జరిగింది. దాంతో ఆ పోటీని తట్టుకోలేక, ఈటీవీ, మాటీవీ, జెమినీ కొన్నాళ్ల క్రితం తమకు తాముగా ఈ పోటీ నుంచి తప్పుకోవడంతో ఒక్క జీటీవీ మాత్రమే వీటిని ఎక్కువగా కొంటోంది. జెమినీ కూడా అప్పుడప్పుడు కొంటోంది కానీ, పోటీకి వెళ్లి కొనడం లేదు. దాంతో పెద్ద హీరోల సినిమాలకే మంచి రేటు వస్తోంది.
       ఈ నేపధ్యంలో మాటీవీ కొత్తగా 'మా మూవీస్' పేరుతో మరో కొత్త చానెల్ ని ప్రారంభించడంతో శాటిలైట్ రైట్స్ మళ్లీ ఊపందుకుంటున్నాయని  టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. దానికి ఊతమిస్తున్నట్టుగా ఇటీవల మాటీవీ 'దూకుడు' సినిమా శాటిలైట్ రైట్స్ ని పెద్ద మొత్తం వెచ్చించి, చేజిక్కించుకున్నట్టు చెబుతున్నారు. సుమారు 5 .75 కోట్లకు ఈ సినిమా హక్కుల్ని మాటీవీ పొందినట్టు తెలుస్తోంది. దీంతో మాటీవీ ఇక శాటిలైట్ రైట్స్ విషయంలో 'దూకుడు'గా వెళ్లడం ఖాయమని అంటున్నారు. 

డ్రగ్స్ తో పట్టుబడ్డ జీవిత సోదరుడు మురళి

టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో తాజాగా ఈ రోజు మరో పెద్ద చేప దొరికిపోయింది. నిర్మాత, ప్రముఖ నటి జీవిత సోదరుడు అయిన మురళి 200 గ్రాముల కొకైన్ తో రెడ్ హేన్ డేడ్ గా పోలీసులకు పట్టుబడ్డాడు. గతంలో 'మగాడు', 'శేషు' వంటి చిత్రాలను నిర్మించిన మురళి గత కొంతకాలంగా డ్రగ్స్ కి అలవాటు పడ్డాడని అంటున్నారు. ఆ క్రమంలో కొకైన్ తీసుకుని వెళుతుండగా హైదరాబాదు, జూబిలీ హిల్స్ ప్రాంతంలో మాటువేసిన వెస్ట్ జోన్ డీసీపీ బృందం మురళీని అరెస్ట్ చేసింది. ఆ సమయంలో అతనితో బాటు వున్న మరో ఇద్దరు వ్యక్తుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో టాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. మొన్నామధ్య టాలీవుడ్ ని డ్రగ్స్ ఉదంతం కుదిపేసిన సంగతి తెలిసిందే. బడా తారలు కూడా ఈ డ్రగ్స్ వలయంలో ఉన్నారంటూ వార్తలొచ్చాయి.
Related Posts Plugin for WordPress, Blogger...