e-cigarette review Ping Yahoo GOSSIPS: March 2012

Wednesday, March 14, 2012

బాలీవుడ్ కి వెళ్తోన్న 'బిజినెస్ మేన్'

'బిజినెస్ మేన్' చిత్రం తెలుగు సినిమా బిజినెస్ ని పెంచడంలో సక్సెస్ ని సాధించింది. అప్పటికే దూకుడు మీదున్న మహేష్ బాబు ఈ సినిమా ద్వారా మరో సారి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ప్రపంచ స్థాయిలో విడుదలైన ఈ సినిమా, హీరోగా మహేష్ బాబుకి ...  దర్శకుడిగా పూరీ జగన్నాథ్ కి ఆ రేంజ్ క్రేజ్ నే అందించింది. ఈ సక్సెస్ తమ తదుపరి చిత్రాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని తెలిసిన మహేష్ బాబు ... పూరీ జగన్నాథ్ చాలా జాగ్రత్తగా కెరియర్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇతర సినీ పరిశ్రమల పై కూడా ఈ సినిమా ప్రభావం విపరీతంగా ఉండటంతో, మహేష్ బాబుతో హిందీలో రీమేక్ చేయాలని పూరీ జగన్నాథ్ అనుకున్నారు. అందుకు మహేష్ నిరాకరించడంతో పూరీ కూడా మౌనంగా వుండిపోయారు.


అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఇందుకు పూరీ జగన్నాథ్ కూడా సిద్ధంగా ఉన్నాడనీ ... అభిషేక్ బచ్చన్ ని హీరోగా ఎంచుకున్నామని అన్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఈ రోజు ఉదయం ఆయన ట్విట్టర్ ద్వారా తెలియ జేశారు. దాంతో మళ్లీ ఈ విషయం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోయిందని తెలుస్తోంది. 

గోపీచంద్ కి సాయం చేయబోతోన్నతాప్సీ

గోపీచంద్ - తాప్సీ జంటగా నటించిన 'మొగుడు' చిత్రం పరాజయం పాలైంది. 'మొగుడు' పెళ్లానికి  గొప్ప కావచ్చుగాని మాకేంటి అనుకున్నారేమోగాని ప్రేక్షకులేవరూ ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఇక ఈ జంట పొరపాటున కూడా తెర మీద కనిపించదని అంతా అనుకున్నారు. అయితే అలా అనుకున్న వాళ్లందరి అంచనాలు ఇప్పుడు తల్లకిందులయ్యాయి. తాజాగా వీళ్లిద్దరూ మరో మారు జట్టు కట్టేందుకు రెడీయై పోయారు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై రూపొందుతోన్న చిత్రంలో గోపీచంద్ నటిస్తోన్న సంగతి ప్రేక్షకులకి తెలుసు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెర కెక్కుతోన్న ఈ సినిమాకి కొంత మంది కథానాయికలను పరిశీలించి చివరికి తాప్సీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నిధి కోసం అన్వేషిస్తోన్న గోపీచంద్ కి కథానాయికగా తాప్సీ సాయం చేస్తూవుంటుంది. ఇక గతంలో గోపీచంద్ నటించిన 'ఒక్కడున్నాడు' చిత్రానికి చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడిగా వ్యవహరించారు. దాదాపు అయిదేళ్ల గ్యాప్ తరువాత వస్తోన్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోననే ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి.    

ఐశ్వర్యరాయ్ కూతురు పేరు ఖరారు

ఐశ్వర్యరాయ్ తన అందచందాలతో విశ్వ సుందరిగా ప్రపంచ ప్రేక్షకుల అభినందనలు అందుకుంది. తను కదిలినా మెదిలినా మీడియా స్పందించే స్థాయికి ఎదిగింది. అమితాబ్ కోడలిగా ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన తరువాత ఆ కుటుంబ నేపథ్యంతో ఆమె పేరు ప్రతిష్టలు మరింత పెరిగాయి. ఇటీవల ఆమె ఓ ఆడ శిశువుకి జన్మనిచ్చింది. సాధారణంగానే ఐశ్వర్య రాయ్ కూతురు ఎలా వుంటుందో చూడాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఆ పాపకి ఏ పేరు పెట్టారో తెలుసుకోవాలని ఆరాటపడతారు. అయితే ఈ రెండు విషయాలను బచ్చన్ కుటుంబీకులు గోప్యంగానే ఉంచుతూ వచ్చారు.  ఈ నేపథ్యంలో ఐశ్వర్య రాయ్ కూతుర్ని ఇదిగిదిగో చూపించేస్తున్నారంటూ ప్రచారాలు మొదలయ్యాయి. ఐశ్వర్య కూతురుకి అభిలాష అని నామకరణం చేశారంటూ వార్తలు షికారు చేశాయి. ఇక ఇప్పుడు ఆ గాసిప్పులన్నిటికీ బచ్చన్ కుటుంబ సభ్యులు తెర దించేసినట్టు తెలుస్తోంది. ఐశ్వర్య రాయ్ కూతురుకి 'ఆరాధ్య' అనే పేరుని ఖరారు చేసినట్టు ఓ ప్రముఖ వార్తా పత్రిక ప్రచురించింది. పేరు చాలా బావుందనుకుంటూనే ... ఆ పాపని చూసే క్షణం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 

తమిళ విలన్ గా జగపతిబాబు ?

తమిళంలో 'తాండవం' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అనుష్క - విక్రమ్ నాయికా నాయకులుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు ఓ కీలకమైన పాత్రని పోషిస్తున్నట్టు ఆ మధ్య హైదరాబాద్ ఫిల్మ్ సర్కిల్స్ లోనూ వినిపించింది. అయితే అందరూ కూడా బహుశా అది సెకండ్ హీరో కేరక్టర్ కావచ్చని అనుకున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇంచు మించు అది విలన్ టైపు కేరక్టర్ అని తెలుస్తోంది. ఆ సినిమాలో అది చాలా పవర్ ఫుల్  కేరక్టర్ అనీ ... అందువల్లనే జగపతిబాబు అంగీకరించాడని అంటున్నారు. గతంలో హీరో సుమన్ కూడా తమిళ చిత్రాల్లో విలన్ గా కనిపించారు. ఇప్పుడదే తరహాలో జగపతిబాబు ఈ సినిమా చేస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి జగపతిబాబు ఎప్పుడూ కూడా హీరోగా మాత్రమే చేస్తానంటూ భీష్మించుకు కూర్చోలేదు. ప్రాధాన్యతగల పాత్రలని అంగీకరించి తను మాత్రమే ఆ పాత్రల్ని పండించగలనని నిరూపించారు. అలా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించిన జగపతిబాబు, విలన్ పాత్రల్లో సైతం అలరించడం ఖాయమని సన్నిహితులు చెబుతున్నారు.

'దమ్ము'చూపించే పాట ఖర్చు 3 కోట్లు

ఎన్టీఆర్ - బోయపాటి కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా 'దమ్ము' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి ప్రేక్షకులకి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఇక్కడ వేసిన ఖరీదైన సెట్లో ఎన్టీఆర్ - త్రిషలపై దర్శకుడు బోయపాటి శీను ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. డాన్స్ మాస్టర్ దినేష్ కంపోజ్ చేస్తోన్న ఈ పాట ఖర్చు అక్షరాలా 3 కోట్లు అని తెలుస్తోంది. ఇంటర్వల్ బ్యాంగ్ కి ముందొచ్చే ఈ సాంగ్, ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. అంతగా ఆ పాటలో ఏవుందనేది తెర మీద చూడాల్సిందేనని అంటున్నారు. కీరవాణి అందించిన మ్యూజిక్ ... ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అవుతాయని చెబుతున్నారు. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతంగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి వాళ్లకి తన 'దమ్ము' చూపించడంలో ఎన్టీఆర్ ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది చూడాలి.

తెలుగు తెరపై అమితాబ్ 'కాందహార్'

అసమాన నటుడు అమితాబ్ నటించిన మలయాళ చిత్రం 'కాందహార్' త్వరలో తెలుగు తెర పై  ప్రత్యక్షం కాబోతోంది. 'కాందహార్' విమానం హైజాక్ చేయబడిన నేపథ్యాన్ని ఇతివృత్తంగా చేసుకుని ఈ చిత్రాన్నితెరకెక్కించారు. మేజర్ రవి దర్శకత్వం వహించిన ఈ సినిమాని, రామ్ ప్రియాంక మీడియా ఎంటర్ టైన్మెంట్స్ వారు తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర ధారులైన తండ్రీ కొడుకులుగా అమితా బచ్చన్ ... గణేష్ వెంకట్రామన్ నటించారు. మిలటరీ మేజర్ గా మోహన్ లాల్ ... ఇతర ముఖ్య పాత్రల్లో ... సుమలత - అనన్య - కావేరిఝా తదితరులు నటించారు. ఈ సినిమా టేకింగ్ అద్భుతంగా ఉంటుందనీ ... ఆద్యంతం ఉత్కంఠ భరితంగా కొనసాగుతుందని నిర్మాతలు శేషగిరి - విశ్వనాథ్ అన్నారు. మలయాళ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న ఈ సినిమా, తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆ స్థాయిలోనే అలరిస్తుందని చెప్పారు. ఈ సినిమా ఏప్రిల్లో అనువాద కార్య క్రమాల్ని పూర్తి చేసుకుని, మే లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అన్నారు.  
Related Posts Plugin for WordPress, Blogger...