e-cigarette review Ping Yahoo GOSSIPS: January 2012

Sunday, January 29, 2012

త్రిషను చూసి జలసీ ఫీలవుతున్నారా?

ఉన్నమాటంటే ఉలుకెక్కువంటారు. చెన్నయ్ సుందరి త్రిష కూడా ఇప్పుడు వయసు ప్రస్తావన తెస్తే అలాగే ఉలిక్కిపడుతోంది. కథానాయిక పాత్రలకి వయసైపోయిన నటిగా త్రిషను కొందరు పేర్కొంటున్న విషయాన్ని ప్రస్తావిస్తే అంతెత్తున లేస్తోంది. తనను చూసి అసూయపడే వాళ్ళే అలాంటి పిచ్చిప్రేలాపనలు పేలుతున్నారంటూ వాళ్లని చెడామడా తిట్టేస్తోంది. "హీరోయిన్ గా గత పదేళ్లుగా నేను ఓ వెలుగు వెలుగుతున్నాను. అది చూసి తట్టుకోలేక కొంతమంది జలసీ ఫీలవుతున్నారు. నా మీద రాళ్లేయాలని చూస్తున్నారు. అలాంటి వాళ్లకు, ఒకటి రెండు సినిమాల్లో నటించి అడ్రస్ లేకుండా పోయిన వాళ్లు కొందరు తోడవుతున్నారు. వీళ్లంతా కలిసి నా మీద ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. నలభై ఏళ్లున్నా ఐశ్వర్యా రాయ్ ఇంకా సినిమాలలో నటిస్తోంది. అలాంటప్పుడు ఇరవై తొమ్మిదేళ్లున్న నేను నటిస్తే తప్పేంటి?" అంటూ రిటార్ట్ ఇస్తోంది త్రిష.

రామ్ చరణ్ ప్రశంసలందుకున్న చిత్రం

హృతిక్ రోషన్ హీరోగా కరణ్ జొహార్ నిర్మించిన 'అగ్నిపధ్' హిందీ చిత్రం కలక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 'బాడీగార్డ్' చిత్రం ఐదు రోజుల వసూళ్లను ఇది నాలుగు రోజుల్లోనే అధిగమిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. కాగా, ఈ చిత్రం టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ తేజాకు ఎంతగానో నచ్చిందట. ఈ చిత్రం చూసి ఎమోషన్ ఆపుకోలేక తన అభిప్రాయాన్ని నలుగురికీ చెప్పాడు. ఇంతటి తీవ్రత, ఉత్కంఠ వున్న యాక్షన్ చిత్రం ఇంతవరకు రాలేదనీ, తాను చూడలేదనీ చరణ్ అంటున్నాడు. హృతిక్ రోషన్ అభినయానికి హ్యాట్సాఫ్ అంటూ అభినందించాడు. అతను ఏ భాష వాడైనా సాటి నటుడిని కాంప్లిమెంట్ చేయడం చరణ్ సంస్కారమనే చెప్పాలి!

'చాణక్యుడు'గా యువ నటుడు తనీష్

నచ్చావులే', 'రైడ్' వంటి చిత్రాలలో నటించిన యువనటుడు తనీష్ నటిస్తున్న తాజా చిత్రం పేరు 'చాణక్యుడు'. ఈ చిత్రం షూటింగు శనివారం హైదరాబాదులో ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగు కొనసాగుతోంది. కన్నడలో పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన జి.శ్రీనివాస్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'ఈ చిత్రంలో హీరో అన్ని రకాల రసాలను టచ్ చేస్తాడు. ఏ పనినైనా తెలివిగా చేస్తాడు. అందుకే చాణక్యుడు అనే టైటిల్ పెట్టాం' అన్నారు చిత్ర నిర్మాతలు. తొలి షెడ్యూలులో రెండు పాటలతో బాటు కొంత టాకీ కూడా చిత్రీకరిస్తామని చెప్పారు. ఇందులో కమర్షియల్ హంగులన్నీ ఉంటాయన్నారు. ఈ చిత్రంలో తనీష్ పక్కన నిషా అగర్వాల్ నటించే అవకాశం వుంది.

బాబాసైగల్ తో 'శృతి' కలిసింది!

 
 
        తన సినిమాలు హిట్టవకపోయినా, తను సింగర్ గా హిట్టవుతున్నందుకు మాత్రం శృతి హాసన్ ఇప్పుడు చాలా హ్యాపీగా వుంది. అటు ఆర్టిస్టుగా పలు చిత్రాలలో నటిస్తూనే, గాయనిగా కూడా తన ఆసక్తిని శృతి ప్రదర్శిస్తూనే వుంది. తను నటించే సినిమాలలోనే కాకుండా ఇతరుల చిత్రాలలో కూడా పాటలు పాడుతోంది. ఆ క్రమంలో తాజాగా బాబా సైగల్ తో కూడా కలిసి ఓ పాట పాడింది. జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చిన 'ముప్పోజుతుం ఉన్ కర్పనైగళ్' అనే చిత్రంలో బాబాతో కలిసి తన గళం కలిపింది. ఇదొక ఫోక్ సాంగ్ అనీ, బాబాతో కలిసి పాడడం ఎంతో హ్యాపీగా ఉందనీ శృతి అంటోంది. చిన్నప్పటి నుంచీ తను బాబా సైగల్ కి ఫ్యాన్ నని చెబుతోంది.
 

 
 
*  గోవా బ్యూటీ ఇలియానా తాను నటిస్తున్న తొలి హిందీ చిత్రం బర్ఫీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుందట. రణబీర్ కపూర్, ప్రియాంకా చోప్రా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది.
*  చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రసాద్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'ఋషి' చిత్రం ఆడియో వేడుక నిన్న రాత్రి హైదరాబాదులోని ప్రసాద్ ఐ మాక్స్ లో జరిగింది. ప్రముఖ నటుడు కమలహాసన్ వీటిని విడుదల చేయగా, డి.రామానాయుడు తొలి సీడీని స్వీకరించారు.
*  సినీ తారల క్రికెట్ టోర్నీ (సీసీఎల్- 2) లో నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ జట్టు గెలిచి సెమీస్ లోకి ప్రవేశించింది. వెంకటేష్ నేతృత్వంలోని తెలుగు వారియర్స్ టీం బెంగాల్ టైగర్స్ ను మట్టికరపించింది.
*  దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ పెద్దకొడుకు ఆర్యన్ రాజేష్ వచ్చే నెలలో పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 3 న హైదరాబాదు జూబ్లీ హిల్స్ లోని ఎఫ్.ఎన్.సీసీలో మిత్రులకు పార్టీ ఇస్తున్నాడు. మీడియాను కూడా పిలుస్తున్నాడట.
*  ప్రముఖ గీత రచయిత వేటూరి పేరుపై విజయనగరంకు చెందిన ఆత్రేయ స్మారక కళాపీఠం ఇచ్చే వార్షిక పురస్కారాన్ని ఈ ఏడాది సంగీత దర్శకుడు మణిశర్మకు ప్రదానం చేశారు. వేటూరి జయంతి సందర్భంగా నిన్న జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు.
 

Monday, January 23, 2012

'బిజినెస్ మేన్' ఫ్లాప్ కిందే లెక్కట!


రాంగోపాల్ వర్మ వరస చూస్తుంటే తన శిష్యుడు పూరీ జగన్నాథ్ కి బ్రాండ్ అంబాసడార్ గా పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎవరినీ, ఏ చిత్రాన్నీ, ఎప్పుడూ ప్రశంసించని వర్మ ఈమధ్య పూరీ జగన్నాథ్ ని మాత్రం ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. పూరీ రూపొందించే ప్రతి సినిమా అతనికి ఓ కళాఖండం గా కనిపిస్తోంది. 'బిజినెస్ మేన్' సినిమా విడుదలైనప్పటి నుంచీ దానిని ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నాడు. ఆ సినిమా 'ఆహా... ఓహో...' అంటూ ట్విట్టెర్ ద్వారా పబ్లిసిటీ గుప్పేస్తున్నాడు.
     తాజాగా మరో అడుగు ముందుకేసి, మరో పోస్ట్ ఇచ్చాడు. "ఇప్పుడే పూరీ జగన్నాథ్ 'బిజినెస్ మేన్-2' స్టోరీ చెప్పాడు. 'బిజినెస్ మేన్-2' ముందు 'బిజినెస్ మేన్' సినిమా ఫ్లాప్ కిందే లెక్క. నమ్మశక్యం కానంతగా 'బిజినెస్ మేన్ -2'లో మహేష్ క్యారెక్టర్ని పూరీ మౌల్ద్ చేశాడు. ఈ క్యారెక్టర్ ముందు 'బిజినెస్ మేన్' లోని మహేష్ క్యారెక్టర్ దిగదుడుపే!" అంటున్నాడు వర్మ. ఏమైనా, ఎవర్ని ఎలా లేపాలో... వర్మకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు కదా?
 

ఆమెకింకా పెళ్లీడు రాలేదట!

అందం ...అదృష్టానికి తోబుట్టువని చెప్పొచ్చు. కాస్త అందంగా ఉండాలే గాని, కాలం కనికరిస్తే కథానాయికలై పోవచ్చు...కలర్ ఫుల్ గా లైఫ్ ని ఎంజాయ్ చెయ్యొచ్చు. అందం ...హారతి కర్పూరం లాంటిదని మన కథానాయకిలకి బాగా తెలుసు. అందుకే వీలైనన్ని సినిమాలు చేసేయాలనీ... కావలసినంత కూడ బెట్టేయ్యలని కంగారు పడిపోతుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో పెళ్లి ప్రస్తావన తెస్తే, అప్పుడే పెళ్ళేంటి అంటూ అమాయకంగా ఫేస్ పెట్టేస్తారు. సాధారణంగా కెరియర్ బాగున్నప్పుడు హీరోయిన్లెవరూ పెళ్లి చేసుకోరు. ఎందుకంటే, పెళ్లి అనేది కెరియర్ కి విరుగుడులా పనిచేస్తుందనే విషయం అందరితో పాటు వాళ్ళకీ తెలుసు కాబట్టి!
       అయితే కెరియర్ మంచి ఊపు మీదున్నప్పుడు హటాత్తుగా పెళ్లి చేసుకుని సైడై పోయిన హీరోయిన్లూ లేకపోలేదు... పెళ్లి విషయాన్ని దాచేసి కామ్ గా కథానాయికలుగా కాలం వెళ్లదీసిన వారూ లేకపోలేదు. ఇక ఈ తరం హీరోయిన్ ల విషయానికొస్తే కెరియర్ గ్రాఫ్ కాస్త బాగుండగానే జెనీలియా త్వరలో ఓ ఇంటిది కాబోతోంది. ఇక కనిపించింది గదా అని 'అశిన్' దగ్గర పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తే, ఒక్క సారిగా ఆమె అదిరి పడిందట! ఇప్పుడిప్పుడే తాను బాలీవుడ్ లో నిలదొక్కుకుంటున్నాననీ...తను సాధించవలసింది ఇంకా చాలా ఉందని చెప్పింది. కాసుల గురించే కాదు...కరిగి పోతున్న వయసు గురించి కూడా ఆమె కాస్త ఆలోచిస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు.

ప్లీజ్... మళ్లీ ఒకే ఒక్క చాన్స్ !

'ఆనంద్' సినిమాతో హీరో రాజా అన్నివర్గాల ప్రేక్షకులకి చేరువయ్యాడు. అంతకు ముందు 'ఓ చినదానా ' లాంటి విజయవంతమైన సినిమాల్లో చేసినప్పటికీ, 'ఆనంద్' సినిమా మాత్రమే అతనికి హీరో గా మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత అతనికి చెప్పుకోదగిన సక్సెస్ ఒక్కటీ లభించలేదు. దాంతో గత కొంత కాలంగా సినిమాలకి దూరమైపోయిన రాజా, మళ్లీ ఈ మధ్య ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు. ముఖ్యం గా ఏ సినిమా ఫంక్షన్ జరిగినా అక్కడికతను కంపల్సరిగా హాజరౌతున్నాడు. గతంలో తన మానాన తానుండే రాజా, ఇప్పుడు అందరితోనూ కలుపుగోలుగా ఉంటున్నాడనీ... ఈ క్రమంలోనే సినిమా ఫంక్షన్లకి ఎక్కువగా వస్తున్నాడని అంటున్నారు.
      ఈ విషయమై రాజాని కదిలిస్తే...కెరియర్ పై సీరియస్ నెస్ కనబరుస్తూ మాట్లాడాడు. తనకి అవకాశాలు బానే వస్తున్నాయనీ... అయితే కథని ఎంపిక చేసుకోవడంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పాడు. మళ్లీ  ఓ సరైన హిట్ పడితే తన సత్తా చూపించడానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు. ఏదేవైనా ఆలస్యం...అమృతం..విషం...అనే సూత్రం సినిమా ఫీల్డ్ కే ఎక్కువగా వర్తిస్తుంది. అలాంటిది...ఆదమరిచి ఉంటే ఆరామ్ గా సినిమా ఫంక్షన్లకి మాత్రమే తిరగాల్సి వస్తుంది మరి!

రణబీర్, కాజల్ జంటగా హిందీ 'బిజినెస్ మేన్'?

ఇటీవల విడుదలైన 'బిజినెస్ మేన్' చిత్రాన్ని హిందీలో కూడా మహేష్ బాబు హీరోగా రీమేక్ చేస్తానని దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రకటించిన సంగతి మనకు తెలుసు. అయితే, తాజా సమాచారం ప్రకారం మహేష్ హిందీ వెర్షన్లో నటించడం లేదని తెలుస్తోంది. తెలుగు చిత్రాల కమిట్ మెంట్స్ వుండడం వల్ల మహేష్ బాలీవుడ్ ఎంట్రీని వాయిదా వేసుకున్నాడట. అందుకని ఈ చిత్రాన్ని హిందీలో రణబీర్ కపూర్ తో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రాం గోపాల్ వర్మ నిర్మిస్తాడట. దర్శకత్వం మాత్రం పూరీనే చేస్తాడు. ఇటీవల 'బిజినెస్ మేన్' చిత్రాన్ని ముంబైలో రణబీర్ కి వర్మ చూపించాడనీ, అతనికి కూడా సినిమా నచ్చిందనీ అంటున్నారు. మరో విశేషం ఏమిటంటే, హిందీలో కాజల్ కథానాయికగా నటిస్తుందట!

నిత్యా మీనన్ కు '50% లక్'

అలా మొదలైంది సినిమా హిట్టయినా కూడా కథానాయిక నిత్యా మీనన్ కి తెలుగులో సరైన అవకాశాలు రాలేదు. ఏవో ఒకటీ అరా వచ్చినా, అవి చిన్నా చితకా సినిమాలే! నితిన్ తో ఆమె నటించిన 'ఇష్క్' సినిమా షూటింగు పూర్తి చేసుకోగా, ప్రస్తుతం నారా రోహిత్ హీరోగా నటిస్తున్న 'ఒక్కడినే' సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగు ఇటీవలే ప్రారంభమైంది. ఇదిలా ఉంచితే, నిత్యా కథానాయికగా త్వరలో మరో సినిమా ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి '50% లక్' అనే టైటిల్ నిర్ణయించారట. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో తెలుస్తాయి. ఏమైనా, ఈ '50% లక్' అనే టైటిల్ మాత్రం ఆమె సినిమాకే కాకుండా, కెరీర్ కి కూడా సరిగ్గా సరిపోతుందని టాలీవుడ్ లో జోక్ చేస్తున్నారు.

సిద్ధార్దకి జ్ఞానోదయమైంది!

తెలుగు తెర పై నట వారసులు కదం తొక్కుతున్న సమయంలో తమిళ తెర నుంచి సడన్ గా ఇటు దూకేసి, ఇక్కడ హీరోగా సెటిలైపోయాడు సిద్ధార్థ. 'బొమ్మరిల్లు'... 'నువ్వొస్తానంటే ...నేనొద్దంటానా!' వంటి సినిమాలతో యూత్ లో తన కంటూ ఓ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం... వీలైతే పాటలు కూడా పాడేయడం సిద్ధూ స్పెషాలిటి. అమ్మాయిల్లో కూడా మంచి ఫాలోయింగే తెచ్చుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో ఇతగాడి జోరు కాస్త తగ్గినట్టుగానే కనిపిస్తోంది. వరసగా పలకరిస్తున్న పరాజయాలే అందుకు కారణమై ఉండొచ్చు.
    ఇదిగో... ఇలాంటి పరిస్థితుల్లోనే సిద్ధూకి జ్ఞానోదయమైంది. తమిళ సినిమాలను నిర్లక్ష్యం చేయడమే తన స్థితికి కారణమని అతనికి అర్ధమైపోయింది. దాంతో ఇప్పుడక్కడ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తన తెలుగు సినిమాలను తమిళ్ లో విడుదలయ్యేలా చూసుకోవడమే కాకుండా, స్ట్రెయిట్ తమిళ్ సినిమాలు కూడా చేయాలని డిసైడై పోయాడట! పనిలో పనిగా బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కి కూడా టచ్ లోనే ఉంటున్నాడు. యువతరం కథానాయకుడిగా కెరియర్ పై ఆ మాత్రం శ్రద్ధ తీసుకోవడం మంచిదే... కాకపోతే, 'తట్టు తగిలితేగాని తత్వం బోధపడదని' మరోమారు నిరూపించాడు

బిర్యానీ భామ ఫుల్ బిజీ అట!

అందం ఉండాలే గాని దానికి అభినయాన్ని జోడించడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ విద్య తెలిస్తే ఈజీగా ఏ భాష లోనైనా హీరోయిన్ అయిపోవచ్చు. బిందు మాధవి కూడా అదే పని చేసింది. ఔను...'ఆవకాయ్ బిర్యాని' అంటూ అందరినీ ఊరించిన బిందు మాధవి గురించే మనం మాట్లాడుకుంటున్నది. ఈ సినిమాలో బిందు మాధవిని చూసిన వాళ్లంతా తెలుగు తెరకి ఓ తెలుగు కథానాయిక దొరికిందనుకుని ఆనందించారు. అయితే...ఆ తర్వాత వచ్చిన అవకాశాలేవీ ఆమెకి పెద్దగా ఉపయోగపడలేదు.
     దాంతో నిరాశ పడకుండా నెమ్మదిగా తమిళ తెరను టచ్ చేసింది. అంతే వరస విజయాలు ఆమె వాకిట్లో కొచ్చి వాలాయి. ప్రస్తుతం డేట్స్ ఎడ్జస్ట్ చేయడానికి కూడా బిందు మాధవి ఇబ్బంది పడుతోందట! తమిళ ప్రేక్షకులు ఆశించే అందం...ఆకర్షణ ఉండటం వల్లే అక్కడ ఆమె అంత బిజీ కావడానికి కారణమని అంటున్నారు. ఈ హడావిడి అంతా చూస్తుంటే, ఆమె రచ్చ గెలిచి ఇంటికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తల రాత ఏ భాషలో ఉంటుందో తెలియదుగాని, అది సక్రమంగా ఉంటే ఏ భాషలోనైనా రాణించవచ్చనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?          
*  అల్లు అర్జున్ కథానాయకుడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రానికి 'పార్ట్ నర్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఇలియానా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మొదట్లో 'హనీ' అనే పేరు తెరపైకి రావడం, బన్నీ దానిని ఖండించడం తెలిసిందే.
 *  సూపర్ స్టార్ కృష్ణ మేనల్లుడు సుదీర్ బాబు హీరోగా నటిస్తున్న 'ఎస్.ఎం.ఎస్' చిత్రం ఆడియో వేడుక నిన్న రాత్రి హైదరాబాదులో ఘనంగా జరిగింది. మహేష్ బాబు ఆడియోను విడుదల చేయగా, వి.వి .వినాయక్ తొలి సీడీని స్వీకరించారు. కృష్ణ, విజయనిర్మల కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
*  ఆది పినిశెట్టి కథానాయకుడుగా వసంత బాలన్ దర్శకత్వంలో రూపొందిన అనువాద చిత్రం 'ఏకవీర' డీటీయస్ పనులు పూర్తయ్యాయి. 300 ఏళ్ల క్రితం నాటి చరిత్ర ఆధారంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత చెప్పారు.
*  'జల్సా' చిత్రం తర్వాత మళ్లీ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి 'సరదా' అనే టైటిల్ నిర్ణయిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
*  సిద్ధార్థ్, అమలాపాల్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'లవ్ ఫెయిల్యూర్' చిత్రం ఆడియోను ఈ నెల 28 న రిలీజ్ చేస్తున్నారు. ఇందులో సిద్ధూ ఓ పాట కూడా పాడాడు. వేలంటైన్స్ డే కి చిత్రాన్ని రిలీజ్ చేస్తారు.

మహేష్ బాబు పేరు మారిపోయిందట!

మహేష్ బాబు పేరు ఇప్పుడు మారిపోయిందట. అందరూ అసలు పేరు వదిలేసి తననిప్పుడు 'సూర్యాభాయ్' అంటూ పిలుస్తున్నారట. ఈ విషయాన్ని మహేష్ బాబే తాజాగా వెల్లడించాడు. ఇంతకీ సూర్యాభాయ్ అంటే అందరికీ తెలిసిందే.... ఇటీవల విడుదలైన 'బిజినెస్ మేన్' సినిమాలో మహేష్ పోషించిన పాత్ర పేరది. దీని గురించి మహేష్ చెబుతూ, "దర్శకుడు పూరీ జగన్నాథ్ కారణంగా నా పేరు సూర్యాభాయ్ గా మారిపోయింది. ప్రతి ఒక్కళ్ళూ నన్ను అదే పేరుతో పిలుస్తున్నారు. అంతలా 'బిజినెస్ మేన్' సినిమాలోని ఆ పేరు పాప్యులర్ అయిపోయింది. ఈ సినిమాని అందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు" అంటున్నాడు ఆనందంతో మహేష్... సారీ... సూర్యాభాయ్!

తెరమరుగవుతున్న తెలుగు విలనిజం!

తెలుగు సినిమా వెలుగు చూసిన నాటి నుంచి ఎన్నో వైవిధ్యమైన కథలు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతూ వస్తున్నాయి. పౌరాణిక-జానపద-సాంఘిక-చారిత్రకాలలో కథాంశం ఏదైనా నాయకుడితోపాటు ప్రతి నాయకుడు ఉండటం సహజం. సినిమాల్లో కనిపించే నాయక ప్రతినాయకులు జీవితంలోని చీకటి వెలుగులను ప్రతిబింబిస్తుంటారు. చీకటి ఉన్నప్పుడే వెలుగు విలువ...చెడు ఉన్నప్పుడే మంచి విలువ తెలుస్తుంది. అలాగే పవర్ ఫుల్ విలన్ ఉన్నప్పుడే హీరో ఎంత సత్తా ఉన్నవాడనేది తెలుస్తుంది. అందుకే, తెలుగు సినిమా తొలి నాళ్ల నుంచి కూడా విలన్ పాత్రలకి ఎంతో ప్రత్యేకత- ప్రాధాన్యత ఏర్పడ్డాయి. దాంతో కథానాయకుడితో సమానమైన ఇమేజ్ విలన్ కి కూడా లభిస్తూ వచ్చింది.
      కథానాయకుడు తన ఆట పాటలతో...హీరోయిజంతో  ఆడియన్స్ ని ఆకట్టుకుంటే, విలన్ మాత్రం తన విలక్షణమైన నటనతోనే ఎక్కువ మార్క్ లు సంపాదించుకోవలసి వస్తుంది. విలన్ల మేనరిజమే వాళ్లకి ప్రేక్షకుల హృదయాల్లో ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. ఎస్.వి.రంగారావు...రాజనాల...నా
గభూషణం...ప్రభాకర్ రెడ్డి...త్యాగరాజు...సత్యనారాయణ...రావు గోపాలరావు...నూతన్ ప్రసాద్...కోట శ్రీనివాసరావు... తదితరులు ఇదే విషయాన్ని నిరూపించారు. పాత బంగారం లాంటి ఆనాటి కథలను పరిశీలిస్తే... నాయకుడు-ప్రతినాయకుడు కథని సమతూకంగా నడిపించిన తీరు కనిపిస్తుంది.
     ఆనాటి విలన్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. ఎస్.వి. రంగారావు విషయానికొస్తే విలనిజం లో ఆయన నభూతో...నభవిష్యతి అనిపించారు. కథానాయకుడు ఎంతటివాడైనా  ఒక చిన్నపాటి మాట విరుపుతో అదిలిస్తూ అధిగమించేవాడు. పౌరాణికాల్లోనే కాదు... జగమెరిగిన జానపద మంత్రగాడిగా జానపదాల్లోనూ ఎస్.వి. రంగారావు ఎదురులేని విలనే! ఆ సమయంలోనే కరుకైన కండలతో, చురుకైన చూపులతో యంగ్ విలన్ గా తన దైన ముద్ర వేశాడు రాజనాల. రాజ్యకాంక్షతో రగిలిపోయే ప్రతినాయకుడిగా ఆయన పండించిన విలనిజాన్ని అంత తేలిగ్గా ఎవరూ మరిచిపోలేరు.
     ఇక సాంఘికాల విషయానికొస్తే... గ్రామపెద్దగా కుటిల రాజకీయాలను చేసే విలన్ గా నాగభూషణం చూపిన వైవిధ్యానికి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పల్సిందే. ఊతపదాల్ని ఉపయోగిస్తూ విలనిజాన్ని రక్తికట్టించిన తొలి విలన్ నాగభూషణమేనని చెప్పొచ్చు. ఆయన సంభాషణల్లోని గమ్మత్తైన విరుపు ... కామెడీ కోటింగ్ తో అందించిన విలనిజం ఆనాటి ప్రేక్షకులని విపరీతంగా అలరించింది. ఇక ప్రతినాయకుడిగా రావుగోపాలరావు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి కాంబినేషన్ లో ఆయన చేసిన పాత్రలు అనితర సాధ్యాలని చెప్పొచ్చు. అలా తరాలవారీగా తరగని విలనిజాన్ని పండించిన ఘనత రావుగోపాలరావుకే దక్కింది.
     విలక్షణమైన విలనిజంతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు నూతన్ ప్రసాద్. అనుకోని ప్రమాదం ఆయన్ని ఆ స్థానానికి దూరం చేయగా, కోట శ్రీనివాసరావు వెలుగులోకి వచ్చారు. విభిన్నమైన ఆయన మేనరిజానికి ప్రేక్షకులు బ్రహ్మరధంపట్టారు. కోట శ్రీనివాసరావు తర్వాత అడపాదడపా ఫ్యాక్షన్ సినిమాల్లోవిలన్ గా కనిపించిన జయప్రకాష్ రెడ్డిని మినహాయిస్తే, ఇక విలన్ లుగా వీలైనన్ని కొత్తముఖాలే కనిపిస్తాయి. జూ.ఎన్టీఆర్ , మహేష్ బాబు, రాం చరణ్, అల్లు అర్జున్, నితిన్, రామ్ తదితర యంగ్ హీరోల కాంబినేషన్ లో వచ్చిన ఏ సినిమాలోనూ మన తెలుగు విలన్ల జాడ కనిపించడం లేదు. ఇక్కడ నుంచే మనకి పరభాషా విలన్ల ప్రభావం పెరగడం, తెలుగు విలన్ లు తెరమరుగు కావడం కనిపిస్తుంది.
     ప్రకాష్ రాజ్, ముఖేష్ రుషి, ప్రదీప్ రావత్, ఆశిష్ విద్యార్ధి, షాయాజీ షిండే, సోనూసూద్, దేవ్ గిల్ తదితరులు విలన్లుగా ఈ తరం సినిమాలను ప్రభావితం చేస్తున్నారు. ట్రెండ్ తో పాటు విలనిజం మారుతుందని సరిపెట్టుకోలేం. పరభాష విలన్లని దిగుమతి చేసుకోవడం వైవిధ్యంగా భావించలేం. నేటి సినిమాల్లో కథ కన్నా ఖర్చుకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుండటం వల్ల, కొత్తదనం పేరుతో చేస్తోన్న ప్రయోగాల వల్ల  విలనిజం రూపురేఖలు మారిపోతున్నాయి. ఆనాటి విలనిజంలో వ్యూహాలు కనిపిస్తే, ఈనాటి విలనిజం ఉన్మాదం అనిపిస్తుంది. ఈనాటి విలన్ ల వింత గెటప్ లు- వికృత చేష్టలు చూస్తుంటే వారి మానసిక స్థితిపై సగటు ప్రేక్షకుడికి కూడా సందేహం కలగక మానదు.
     ఆ రోజుల్లో హీరోలు -విలన్లు నువ్వా? నేనా? అన్నట్టు సమఉజ్జీలుగా ఉండే వాళ్లు. ఇక, ఈతరం హీరోలకి గానీ... వాళ్లతో తలపడే విలన్లకి గాని ఎక్కడా పొంతన ఉండదు. లేడిపిల్ల లాంటి హీరో... సింహం లాంటి విలన్ ని చితక బాదేయడం కాస్త విడ్డూరంగానే అనిపిస్తుంది. పోతే, ప్రాంతమేదైనా...భాష ఏదైనా...టాలెంట్ ఉన్న వాళ్లే ఇక్కడ రాణిస్తారనేది నూటికి నూరు శాతం నిజం. అయితే విలన్ పాత్రల్లో విజ్రుంభించగల ప్రతిభావంతులెందరో తెలుగులో ఉన్నారు. వాళ్లకి అవకాశమిచ్చి ప్రోత్సహిస్తే కథలో కొత్తదనమే కాదు, తెలుగుదనమూ ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలనీ...గత వైభవం తిరిగిరావాలని ఆశిద్దాం.                                

ఇమ్రాన్ ఖాన్ పక్కన ఇలియానా

టాలీవుడ్ లో అవకాశాలు తగ్గినప్పటికీ గోవా బ్యూటీ ఇలియానాకు బాలీవుడ్ లో మాత్రం బాగానే వుంది. ఇప్పుడామె కెరీర్ అక్కడ ఊపందుకుంటోంది. తొలి సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఇల్లీ బ్యూటీ హిందీలో 'బర్ఫీ' సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. రణబీర్ కపూర్, ప్రియాంకా చోప్రాలతో బాటు తను కూడా అందులో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఆమె నటనకు సెట్లో యూనిట్ కూడా ఇటీవల కంటతడి పెట్టారంటూ వార్తలొచ్చాయి. అందుకేనేమో, ఆమెకు తాజాగా మరో ఆఫర్ వచ్చింది. అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ హీరోగా నటించే చిత్రంలో ఇలియానా కథానాయికగా ఎంపికైంది. ఈ విషయం గురించి ఇలియానా చెబుతూ, బాలీవుడ్ లో తనకు చాలా ఎంకరేజింగ్ గా వుందని అంటోంది.       

మరో స్క్రిప్ట్ కి ఓకే చెప్పిన గోపీచంద్


రెండేళ్ల క్రితం రామ్ హీరోగా 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శ్రీవాస్, తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. ఇందులో గోపీచంద్ హీరోగా నటిస్తాడని తెలుస్తోంది. యాక్షన్ ఎలిమెంట్ తో తయారుచేసిన ఈ కథ గోపీచంద్ కి బాగా నచ్చడంతో చేయడానికి వెంటనే ఒప్పుకున్నాడట. గతంలో రవితేజ, త్రిష జంటగా 'కృష్ణ' చిత్రాన్ని నిర్మించిన శ్రీ లక్ష్మి నరసింహ విజువల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం షూటింగు త్వరలో ప్రారంభమవుతుంది. మరోపక్క భూపతి దర్శకత్వంలో కూడా గోపీచంద్ ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే!
 

చిరంజీవిపై మళ్లీ విరుచుకుపడ్డ బాలకృష్ణ


నిన్నటి దాకా సినిమా రంగంలో ఒకరిని మరొకరు గౌరవించుకుంటూ, ఆలింగనాలు చేసుకున్న చిరంజీవి-బాలకృష్ణ, ఇప్పుడు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. రాజకీయాలలో ఇద్దరూ చెరో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో పైచేయి కోసం ఇద్దరూ పోటీపడుతున్నారు. 'చిరంజీవిపై పోటీకి సై' అంటూ నిన్న బాలకృష్ణ ప్రకటించడంతో, ఈ రోజు చిరంజీవి దానిని లైట్ తీసుకున్నారు. బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేసినా గొప్పేమీ లేదనీ, దానిని తాను లైట్ తీసుకుంటానని ఈ రోజు తిరుపతిలో వ్యాఖ్యానించారు.
       ఇదిలా ఉంచితే, బాలకృష్ణ మాత్రం చిరంజీవిపై విమర్శల స్పీడు బాగా పెంచేశారు. ఈవేళ విశాఖపట్నంలో మరింత దూకుడు ప్రదర్శించారు. తనను ఒకరు బాలుడు అన్నారనీ, అలాంటి వారు తనని ఒక వైపే చూశారనీ, కావాలంటే తన మరో రూపం కూడా చూపిస్తాననీ బాలకృష్ణ ఆవేశంగా అన్నారు. 'కోట్లాది రూపాయలకు పార్టీని అమ్ముకున్న వాళ్ళా నన్ను విమర్శించేది?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం కావాలని కొందరు కలలు కంటున్నారనీ, అలాంటి వారు ఎన్టీఆర్ కాలిగోటికి కూడా సరితూగరనీ, చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ పరోక్షంగా విమర్శించారు. ఈ మాటల యుద్ధం ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి! 
 

Related Posts Plugin for WordPress, Blogger...